బాధ్యతాయుత ప్రభుత్వాలను ఎన్నుకోవాలి
శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: ప్రజల బాగు కోసం ఆలోచించే బాధ్యతాయుత ప్రభుత్వాలు ఏర్పడాలంటే ఓటు అనే ఆయుధంతోనే సాధ్యమని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని వర్ధమాన్ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం విద్యార్థులకు ‘లెట్స్ ఓట్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ‘ఓటు హక్కు’పై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ఓటు హక్కు వినియోగించని వారికి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. దేశ భవిష్యత్తు యువత తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందన్నారు. కాలయాపనతో విలువైన సమయాన్ని వృథా చేయవద్దన్నారు. సినిమా ప్రభావం నేటి యువతను పెడదారి పట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన ం చేసే పని వల్ల తల్లిదండ్రులు, ఊరికి మంచి పేరు రావాలన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
మౌనం వీడండి...
ఆక్రందన చేసే వాడి కన్నా దుర్మార్గాలను చూస్తూ మౌనంగా ఉండే మంచి వాడే సమాజానికి చేటు అని లెట్స్ ఓట్ సంస్థ ప్రతినిధి, ఇస్రో మాజీ శాస్త్రవేత్త జె.ఆది శేషయ్య చౌదరి అన్నారు. యువత మౌనం వీడి దేశ భవిష్యతు కోసం నడుం బిగించాలన్నారు. సమర్థుడైన నాయకత్వాన్ని ఎన్నుకున్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. సరైన నాయకత్వం లేకుంటే అభివృద్ధి కుంటుపడి, శాంతి భద్రతలకు విఘాతం కలగడమే కాకుండా నిరుద్యోగం పెరిగిపోతుందన్నారు. కార్యక్రమంలో పర్యావరణ వేత్త పురుషోత్తంరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జేవీఆర్ రవీంద్ర పాల్గొన్నారు.