సాక్షి, అమరావతి: దేశంలోనే మొట్టమొదటి రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనుల్లో రివర్స్ టెండర్ల ద్వారా గతం కంటే 20.33 శాతం మిగులు లభించిందని, మొత్తం రూ. 290 కోట్ల పనుల్లో దాదాపు రూ. 58 కోట్లు ఖజానాకు ఆదా అయ్యాయని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని టెండర్లలో రివర్స్ టెండరింగ్ అమలుచేస్తామని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రివర్స్ టెండర్లలో విజయం సాధించి.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.
మాజీ సీఎం చంద్రబాబు తన హయాంలో మాక్స్ ఇన్‌ఫ్రా కంపెనీకి ఈ పనులు కట్టబెట్టారని, ఇప్పుడు అదే కంపెనీ వాళ్లు 15.7 శాతం తక్కువ ధరకు టెండర్లు వేసి.. ఈ పనులను సొంతం చేసుకున్నారని మంత్రి వివరించారు. ప్రాజెక్టు పనులు అత్యంత పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో జ్యూడిషియల్ ప్రివ్యూ తీసుకువచ్చామని ఆయన తెలిపారు. నవంబర్‌లోపు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. గత చంద్రబాబు సర్కారు ప్రాజెక్టు పనుల్లో కమీషన్లు తీసుకోవడంపై పెట్టిన శ్రద్ధ.. ముంపు బాధితులను ఆదుకోవడంపై చూపించలేదని, బాధితులుకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు 20వేల ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. రూ. 300 కోట్ల పనుల్లో రూ. 60 కోట్లు ఆదా అయిందని, ఈ లెక్కన గత ప్రభుత్వం ఎంత దోపిడీ చేసిందో తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు.
టెండర్లలో ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందని, కానీ ప్రభుత్వానికి కావాల్సిన వారికే టెండర్లు కట్టబెట్టారని చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తప్పుబట్టారు. ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అవినీతిరహితంగా, అత్యంత పాదర్శకంగా పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
గతంలో అడ్డంగా దోచున్నవాళ్లే.. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేతలపై మంత్రి అనిల్‌కుమార్ మండిపడ్డారు. చంద్రబాబుకు వయసు పైబడుతోందని, ఆయన ఇకనైనా చిల్లర, చీప్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు తన హయాంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని, కానీ, ఉద్యోగాల విషయంలోనూ ఆయన చీప్‌గా ఆరోపిస్తున్నారని దుయ్యబట్టారు. ‘70 ఏళ్ళు వచ్చాయి.. గత 40 ఏళ్లలో ఎన్నో దుర్మాగాలు చేశావు.. ఇప్పటికీనా బుద్ధి మార్చుకో’ అని బాబుకు సూచించారు. ఇలాగే ప్రవర్తిస్తే.. భవిష్యత్తులో చంద్రబాబు రాజకీయ మనుగడ కూడా కోల్పోతారని హెచ్చరించారు. వేలకోట్ల రూపాయలు ఆదా చేసేందుకు అన్ని నిర్మాణాల్లోనూ రివర్స్ టెండర్లు అమలు చేస్తామని చెప్పారు. దేవుడు తమవైపు ఉన్నాడని, అందుకే రాష్ట్రమంతా వర్షాలతో పచ్చగా ఉందని, ప్రాజెక్టులన్నీ నిండుగా ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment