‘సార్వత్రిక’ ఫలితాలపై నేటి నుంచి రాజమండ్రిలో జగన్ సమీక్ష
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై చర్చించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయడానికి బుధవారం నుంచి జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నేతలతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. 2014 లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో 67 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలను గెల్చుకున్న సంగతి తెలిసిందే.
తొలి విడతగా రాజమండ్రిలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో నేటి నుంచి మూడు రోజుల పాటు (6 వరకు) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, ఉభ య గోదావరి జిల్లాల్లోని నియోజకవర్గాలల్లో పరిస్థితిపై సమీక్షిస్తారు. తర్వాత 9, 10 తేదీల్లో కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై ఒంగోలులో సమీక్షలు ఉంటాయి. 11, 12 తేదీల్లో చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.