మిర్యాలగూడ, న్యూస్‌లైన్: ప్రజల అవసరాల కోసం ఎఫ్‌సీఐ (భారత ఆహార సంస్థ) ప్రతి ఏటా మిల్లర్ల నుంచి సేకరించే లెవీ బియ్యం లక్ష్యాన్ని ఎట్టకేలకు అధికారులు ఖరారు చేశారు. జిల్లాలో లెవీ బియ్యం సేకరణ లక్ష్యం నిర్ధారణ కాగానే మిల్లర్ల నుంచి బియ్యం సేకరణ ప్రారంభించారు. లక్ష్యం నిర్ధారణ కొంత ఆలస్యమైనా ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం 1.43 లక్షల హెక్టార్లలో ఉండడం వల్ల లక్ష్యం పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. 2012-13వ సంవత్సరంలో 1.50లక్షల టన్నుల పచ్చి బియ్యం, 8.09లక్షల టన్నుల బాయిల్ట్ బియ్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు.
పచ్చిబియ్యం నూరుశాతం లక్ష్యం పూర్తి చేసినా, బాయిల్డ్ బియ్యం మాత్రం కేవలం 5.86 లక్షల టన్నులు మాత్రమే సేకరించి లక్ష్యాన్ని పూర్తి చేయలేకపోయారు. 2013-14లో జిల్లాలో 1.94లక్షల టన్నుల పచ్చిబియ్యం, 7.94 లక్షల బాయిల్డ్ బియ్యాన్ని లెవీగా సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. అందులో ఇప్పటివరకు 27వేల టన్నుల పచ్చిబియ్యం సేకరించారు.
ప్రతి మిల్లు నుంచి 75 శాతం లెవీ
జిల్లాలోని ప్రతి రైస్‌మిల్లు నుంచి లెవీ బియ్యాన్ని అధికారులు సేకరిస్తారు. రైతుల నుంచి మిల్లర్లు కోనుగోలు చేసిన ధాన్యంలో 75 శాతం బియ్యాన్ని ఎఫ్‌సీఐకి లెవీగా ఇవ్వాలి. మిల్లర్లు 75 శాతం బియ్యాన్ని ఎఫ్‌సీఐకి లెవీగా ఇస్తేనే మిగతా 25శాతం ఎక్కడైనా ఇతర మార్కెట్‌లో విక్రయించుకోవడానికి సివిల్ సప్లయిస్ అధికారులు అనుమతినిస్తారు. ఈ సీజన్‌లో పచ్చిబియ్యం లెవీ సేకరణను ఇప్పటికే ప్రారంభించారు.
ఫైన్ ధాన్యం కొనుగోళ్లు నిల్
బీపీటీలో సూపర్ ఫైన్ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సివిల్ సప్లయిస్ ఆధ్వర్యంలో జిల్లాలో ఏడు కేంద్రాలు ప్రారంభించారు. సూపర్ ఫైన్ బీపీటీకి క్వింటాకు రూ.1500 చెల్లించాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకెళ్లకపోవడంతో ఇప్పటివరకు ఒక క్వింటా ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు.
లెవీ సేకరణ ప్రారంభించాం : హరిజవహర్‌లాల్, జాయింట్ కలెక్టర్
లెవీ బియ్యం సేకరణను ప్రారంభించాం. ఇప్పటివరకు 27వేల టన్నుల పచ్చిబియ్యం సేకరించాం. ఈ ఏడాది జిల్లాకు నిర్ణయించిన లక్ష్యం కంటే కాస్త ఎక్కువగానే సేకరించాలని నిర్ణయించుకున్నాం. పచ్చిబియ్యం 2లక్షల టన్నులు, బాయిల్డ్ బియ్యం 8 లక్షల టన్నులు సేకరించాలని నిర్ణయించాం.
లెవీ ఖరారు
Published Sat, Nov 30 2013 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM
Advertisement
Advertisement