జిల్లాలో సమైక్య సెగలు ఉధృతమవుతున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంపై నిరసనలు పెల్లుబుకుతున్నాయి. సమైక్యవాదులు సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివారం మానవహారాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, వినూత్న నిరసనలు, నిరాహారదీక్షలతో వాడవాడలా సమైక్యవాదాన్ని హోరెత్తించారు.
సాక్షి, విజయవాడ : జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా వరుసగా 33వ రోజైన ఆదివారం కూడా కొనసాగాయి. మచిలీపట్నంలో ఐక్య క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. మతగురువులు, మహిళలు, యువకులతో పాటు పిల్లాపాపలు సైతం పాల్గొని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. జగ్గయ్యపేటలో ఆర్‌సీఎం చర్చి ఫాదర్ దామాల విజయకుమార్ ఆధ్వర్యంలో సంఘస్తులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగులు ఆటోలు తుడుస్తూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
రాజకీయేతర జేఏసీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కూడలి వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు ఆదివారంతో 13వ రోజుకు చేరాయి. జననేత జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ వైఎస్సార్ సీపీ మహిళా నేతలు ముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పామర్రు మండల ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. పామర్రు సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు రిలేదీక్షలలో పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో రహదారిపై వంటావార్పు నిర్వహించారు.
గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం నుంచి 3 రోజుల పాటు 72 గంటల సమ్మెకు జేఏసీ పిలుపునిచ్చింది. గన్నవరంలో జరుగుతున్న రిలే దీక్షలు 19వ రోజుకు చేరాయి. గుడివాడ నెహ్రూచౌక్‌లో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షల్లో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ దీక్షలకు రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్ మద్దతు తెలిపారు. వైఎస్ జగన్ దీక్షను భగ్నంచేయటాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్ధతుగా వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు యాసం చిట్టిబాబు, గుడివాక శివరావ్ ఆధ్వర్యంలో అవనిగడ్డలో రహదారులను ఊడ్చి వాహనాలను తుడిచి నిరసన వ్యక్తం చేశారు. కోడూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు.
నడకుదురులో వైఎస్సార్ సీపీ నాయకులు రిలే దీక్ష చేశారు. శిబిరాన్ని నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ప్రారంభించారు. మైలవరం కార్పెంటర్లు రహదారిపై పనులు చేసి నిర సన వ్యక్తం చేశారు. కైకలూరులో ఏపీ ట్రక్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 100 ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. కలిదిండి మండలం సంతోషపురం పంచాయతీ శివారు నరసింహపురం గ్రామానికి చెందిన మహిళలు, గ్రామస్తులు కలిదిండి సెంటరులో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే దీక్ష చేశారు. మహిళలు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉయ్యూరు జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలో ఆదివారం కొబ్బరితోట, జనాత బజారుకు చెందిన యువత పాల్గొని తమ నిరసన తెలిపారు. వీరికి మద్దతుగా పెద ఓగిరాల నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. తోట్లవల్లూరులో జేఏసీ ఆధ్వర్యాన జరుగుతున్న రిలే దీక్షలలో ఆర్‌ఎంపీ వైద్యులు పాల్గొన్నారు.
జగన్ కోసం పూజలు..
నందిగామ మండలంలోని చందాపురం సమీపంలో సయ్యద్ బాలే మస్తాన్ షా వలి దర్గాలో జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తిరువూరులో విజయవాడ-జగదల్‌పూర్ జాతీయ రహదారిపై వంటా వార్పు నిర్వహించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం కుదుటపడటంతో పాటు, ఆయన సోదరి షర్మిల చేపట్టనున్న బస్సు యాత్ర విజయవంతం కావాలని కోరుతూ తోట్లవల్లూరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం బాగుపడాలని కోరుతూ జిల్లా హోల్‌సేల్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు అమ్మతల్లి రవీంధ్రనాధ్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిటాల హనుమంతునికి ప్రత్యేక పూజలు చేశారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పంజా సెంటర్‌లో ముస్లిములు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ హాజరయ్యారు. పెదపారుపూడిలో గుడివాడ-కంకిపాడు ప్రధాన రహదారిపై వైఎస్సార్ సీపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. దీనికి పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు ఉప్పులేటి కల్పన నేతృత్వం వహించారు. నూజివీడు జంక్షన్‌రోడ్డులో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్షలను జిల్లా కన్వీనర్ ఉదయభాను, నియోజకవర్గ కన్వీనర్ మేకా ప్రతాప్ అప్పారావు ప్రారంభించారు.
రేపు విజయవాడలో ఆస్పత్రుల బంద్..
ఈ నెల మూడో తేదీన విజయవాడలో ఆస్పత్రులు బంద్ చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయించింది. మరోవైపు ఎన్టీటీపీఎస్‌లో కేంద్ర బలగాలను దింపడం వివాదాస్పదంగా మారింది. ఉద్యోగుల సమైక్య నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బలగాలను దింపి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 207 మందితో డీఎస్పీ స్థాయి అధికారి వీటిని పర్యవేక్షిస్తున్నారు.