భారీ వర్షాలకు జిల్లాలోని నదులు ఉప్పొంగుతున్నాయి. చెరువులు, కాలువలకు గండ్లు పడి పొలాలు, ఊళ్లను ముంచెత్తుతున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: భారీ వర్షాలకు జిల్లాలోని నదులు ఉప్పొంగుతున్నాయి. చెరువులు, కాలువలకు గండ్లు పడి పొలాలు, ఊళ్లను ముంచెత్తుతున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు తెగిపడటంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు కన్నీటిపాలవుతున్నారు. వరాహ నది కూడా అదే దారిన భయపెడుతోంది. చిన్న, మధ్య, పెద్ద తరహా జల ప్రాజెక్టులకు సంబంధించి 76 చోట్ల గండ్లు పడ్డాయి.
జలాశయాలు ప్రమాదస్థాయికి చేరాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో వచ్చి పడడంతో శనివారం ఒక్క రోజే తాండవ రిజర్వాయర్‌లో ఏడు అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో అధికారులు రాత్రి ఏడు గంటల సమయంలో రెండు స్పిల్‌వే గేట్ల ద్వారా రెండు వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలారు. జిల్లాలోని నాతవరం, పాయకరావుపేటలతోపాటు తూర్పుగోదావరి జిల్లా తుని, కోటనందూరు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలవారిని అధికారులు అప్రమత్తం చేశారు.
అలాగే చోడవరం, మాడుగుల ప్రాంతంలోని కల్యాణపులోవ రిజర్వాయర్ మినహా రైవాడ, కోనాం, పెద్దేరు రిజర్వాయర్లు నిండు కుండల్లా ఉండటంతో గేట్లు ద్వారా అదనపునీటిని దిగువ నదుల్లోకి వదిలేస్తున్నారు.ఎగువ ప్రాంతంనుంచి వేలాది క్యూసెక్కుల ఇన్‌ఫ్లో జలాశయాల్లోకి చేరడంతో అన్నీ నిండుకులా ఉన్నాయి. రైవాడ సాధారణ నీటిమట్టం 114మీటర్లు. ప్రస్తుతం 113.75మీటర్లకు చేరింది. దీంతో ఈ జలాశయం నుంచి 4500క్యూసెక్యుల నీటిని విడిచిపెట్టడంతో శారదానది ఉగ్రరూపం దాల్చింది. తీరప్రాంత గ్రామాల్లోకి ఉప్పొంగుతోంది.
కోనాం సాధారణ నీటిమట్టం 101మీటర్లు. ప్రస్తుతం 100.25మీటర్లకు చేరింది. దీని నుంచి 900క్యూసెక్యుల నీటిని బొడ్డేరు నదిలోకి వదులుతున్నారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని రిజర్వాయర్‌లదీ ఇదే పరిస్థితి. జోలాపుట్టులోకి భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మాచ్‌ఖండ్ లోకి ఉపనదుల ద్వారా వరద నీరు చేరుతోంది. డుడుమలోనూ నీరు ప్రమాదస్థాయిలోనే ఉంది. బలిమెల రిజర్వాయర్‌లో గరిష్ట నీటిమట్టం 1516 అడుగులు. ప్రస్తుతం 1515కి చేరుకుంది. సీలేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం నిలకడగా ఉంది.