ఢిల్లీకి ‘రిత్విక్‌’ డబ్బు? | Ritwik Company money to the Delhi person? | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి ‘రిత్విక్‌’ డబ్బు?

Published Sun, Oct 14 2018 2:39 AM | Last Updated on Sun, Oct 14 2018 2:04 PM

Ritwik Company money to the Delhi person? - Sakshi

శనివారం హైదరాబాద్‌లోని సీఎం రమేష్‌ ఇంటి వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

సాక్షి, హైదరాబాద్, అమరావతి: తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు చెందిన హైదరాబాద్‌లోని నివాసం, వ్యాపార సంస్థల్లో రెండో రోజు శనివారం కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. రిత్విక్‌ సంస్థలకు సంబంధించిన లావాదేవీలపై ప్రధానంగా దృష్టి సారించిన అధికారులు ఢిల్లీలోని ఓ వ్యక్తికి రూ.వేల కోట్లను చేరవేసినట్లు గుర్తించారని తెలుస్తోంది. 2015–16, 16–17 ఆర్థిక సంవత్సరాల్లో భారీ స్థాయిలో పెరిగిన కంపెనీ లావాదేవీలపై పలు అనుమానాలతో ఐటీ శాఖ ఈ సోదాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టుల్లో మెజార్టీ పనులను సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ సంస్థలే దక్కించుకున్నాయి.

సాగునీటి పనులు చేయకుండానే చెల్లింపులు?
సాగునీటి ప్రాజెక్టుల పనులను దక్కించుకున్న రిత్విక్‌ సంస్థ ఆ పనులు చేయకుండానే చేసినట్టు రికార్డుల్లో చూపించి నిధులు బొక్కేసిందనే కోణం ఐటీ సోదాలతో వెలుగులోకి వస్తోంది. దీంతో ఇరిగేషన్‌ సబ్‌ కాంట్రాక్టు పనుల్లో గోల్‌మాల్‌ జరిగినట్టు తేలుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల ప్రాజెక్టులను దక్కించుకున్న రిత్విక్‌ సంస్థ సబ్‌కాంట్రాక్టుల పనులు చేయకుండానే చేసినట్టు చూపిస్తూ రూ. వేల కోట్లను డ్రా చేసిందనే కీలక అంశాన్ని సోదాల సందర్భంగా ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. సబ్‌కాంట్రాక్టుల కింద సీఎం రమేష్‌ సంస్థ పొందిన రూ.వేల కోట్లను ఢిల్లీలోని ఒక వ్యక్తి వద్దకు తరలించినట్లు నిర్థారించారు. అయితే ఆ నిధులను హవాలా రూపంలో ఇతర దేశాలకు తరలించారా? ఏపీలోని ఇతర వ్యక్తులు, సంస్థలకు మళ్లించారా? అనే కోణాల్లో ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం రమేష్‌కు చెందిన ఆస్తుల రికార్డులను పరిశీలిస్తూ కూపీ లాగుతున్నారు.

గుట్టుగా నగదు లావాదేవీలెందుకు?
రిత్విక్‌ సంస్థలు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనుల బిల్లులన్నీ నగదు రూపంలోనే జరగడంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. ఓ ప్రాజెక్టులో రూ.1,800 కోట్లు, మరో ప్రాజెక్టులో రూ.900 కోట్ల విలువైన బిల్లులన్నీ నగదు రూపంలో రిత్విక్‌కు చేరడం, వాటికి సంబంధించిన పన్నులను కంపెనీ ఎగ్గొట్టిందన్న ఆరోపణలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అలాగే రిత్విక్‌ కంపెనీకి అనుబంధంగా ఉన్న మరో ఆరు కంపెనీలపైనా ఆరా తీస్తున్నారు. కేవలం ఒక్క కంపెనీ ద్వారానే రూ.2 వేల కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరిగితే మిగిలిన ఆరు కంపెనీల ద్వారా ఇంకెన్ని కోట్ల రూపాయలు లెక్క లేకుండా చేతులు మారి ఉంటాయన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా ప్రాజెక్టులకు సంబంధించిన బిల్లులన్నీ ఆన్‌లైన్‌ చెల్లింపులు లేదా ఆర్టీజీఎస్‌ / చెక్కుల రూపంలో ఉంటాయి. అలాకాకుండా రూ.వందల కోట్లను నగదు ద్వారా ఎందుకు స్వీకరించారనే అంశంపై విచారిస్తున్నట్లు ఐటీ వర్గాలు చెబుతున్నాయి. రిత్విక్, అనుబంధ కంపెనీలు దాఖలు చేసిన మూడేళ్ల ఐటీ రిటర్నుల్లో భారీ స్థాయిలో లాభాలు పెరిగిపోవడం, పెట్టుబడులు పెరగడంపైనా అనుమానాలున్నాయని, అందుకే సోదాలు జరుపుతున్నామని, విచారణ ఇంకా కొనసాగించాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 

డిజిటల్‌ లాకర్లలో బట్టలా...?
ఎంత ఆస్తిపరుడైనా సాధారణ బ్యాంకు లాకర్లు లేదా కోడ్‌ నంబర్లతో తెరుచుకునే లాకర్లను వినియోగిస్తారు. అలాంటిది సీఎం రమేశ్‌ ఏకంగా తన ఇంట్లో రెండు డిజిటల్‌ లాకర్లను ఏర్పాటు చేసుకోవడంపై అధికారులు విస్తుపోయారు. కోడ్‌ రూపంలో కాకుండా వేలిముద్రల ద్వారా మాత్రమే ఇవి తెరుచుకునేలా ఏర్పాట్లు చేసుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఐటీ అధికారుల సూచనల మేరకు సీఎం రమేశ్‌ శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకుని రెండు లాకర్లను తెరిచారు. ఒక లాకర్‌లో ఏపీలో చేపట్టిన ప్రాజెక్టుల కేటాయింపుల వివరాలతో కూడిన ఫైళ్లు, ప్రాజెక్టుల పాత అంచనాలను పెంచుతూ రూపొందించిన డాక్యుమెంట్లు ఉన్నట్లు గుర్తించారు. మరో లాకర్‌లో రమేశ్‌కు చెందిన 3 బ్యాంకు ఖాతాల వివరాలు, చెక్‌బుక్‌లు, 2 పెన్‌డ్రైవ్‌లు, ఐటీ రిటర్నులకు సంబంధించిన కాపీలు లభ్యమైనట్లు తెలిసింది. ఆ లాకర్లలో ఎలాంటి డాక్యుమెంట్లు లేవని, కేవలం తన బట్టలు మాత్రమే ఉన్నాయని సీఎం రమేశ్‌ తన నివాసం వద్ద మీడియాతో పేర్కొనడం గమనార్హం. అయితే అందులో ప్రాజెక్టులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఐటీ రిటర్నుల ఫైళ్లు తదితరాలు బయటపడటం రమేశ్‌ కంపెనీల లావాదేవీలపై ఐటీ అధికారుల సందేహాలకు బలాన్ని చేకూర్చినట్లు అయింది. 

ఏకధాటిగా విచారణ...
రమేశ్‌ బావమరిది, రిత్విక్‌ కంపెనీల్లో డైరెక్టర్‌ హోదాతోపాటు ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే గోవర్ధన్‌ నాయుడును ఐటీ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి విచారించారు. వైఎస్సార్‌ జిల్లాలో ఐటీ సోదాలు పూర్తి కాగానే ఆయన్ను అక్కడి నుంచి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రిత్విక్‌ కంపెనీ కార్యాలయానికి తరలించారు. శనివారం రాత్రి 10 గంటల వరకు గోవర్ధన్‌ను విచారించారు. రమేశ్‌ సోదరుడు రాజేశ్‌ సైతం కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉండటంతో ఆయన్ను మరో బృందం విచారించింది. రిత్విక్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, రిత్విక్‌ ప్రాజెక్టŠస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, రిత్విక్‌ çహోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, రిత్విక్‌ గ్రీన్‌ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, కదిరి గ్రీన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, గ్లోబల్‌ ఎర్త్‌ మినరల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, రిత్విక్‌ అగ్రికల్చర్‌ ఫారమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో మూడేళ్లుగా జరిగిన లావాదేవీలు, ఏ ప్రాజెక్టులకు ఎంత బిల్లు తీసుకున్నారు? ఐటీ రికార్డుల్లోకి వచ్చిందెంత? నగదు రూపంలో తీసుకున్నదెంత? తదితర అంశాలను ప్రతి డాక్యుమెంట్‌ ముందు పెట్టి అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. అన్ని కంపెనీల్లో 2015 తర్వాత ఒకేసారి పెట్టుబడులు పెట్టడం, వాటి షేర్ల విలువ పెరగడం, వాటికి సంబంధించిన ఫైలింగ్‌లో వ్యత్యాసాలపై రమేశ్‌ సోదరుడు, బావమరిదిని ప్రశ్నించినట్లు తెలిసింది. వీరిద్దరితోపాటు కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న మరో ఆరుగురికి విచారణకు హాజరు కావాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. సీఎం రమేశ్‌ ఇంటికి సంబంధించిన విషయంలో ఆయన భార్యకు కూడా అధికారులు నోటీసులిచ్చారు. రిత్విక్‌ కంపెనీ వ్యవహారాలకు సంబంధించి మొత్తం 4 నోటీసులను  రమేశ్‌తోపాటు ఆయన సోదరుడు, బావమరిదికి ఐటీ శాఖ జారీ చేసినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement