సాక్షి, అమరావతి: పచ్చి అబద్ధాలను పదేపదే వల్లె వేసి అక్రమాలను కప్పిపుచ్చుకోవచ్చా? అవాస్తవాలు చెప్పి వాస్తవాలను దాచేయొచ్చా? మీడియా ముందు రంకెలు వేస్తే దొంగ దొర అవుతాడా? ముఖ్యమంత్రి చంద్రబాబు దన్నుతో సారా వ్యాపారిగా జీవితం ప్రారంభించి, కాంట్రాక్టర్‌గా రూపాంతరం చెంది, రాజకీయ నేతగా రంగు మార్చుకున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వ్యవ హారశైలి చూస్తే అలానే ఉంది. సీఎం రమేష్ కుటుంబానికి చెందిన కాంట్రాక్టు, వ్యాపార సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మూడు రోజులపాటు సోదాలు చేశారు. కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగిస్తున్నారు. ఐటీ సోదాలు పూర్తయిన తర్వాత సీఎం రమేష్ ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తన అక్రమాలను కప్పిప్చుకోవడానికి అబద్ధాలు వల్లె వేశారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. కనికట్టు చేసేందుకు ప్రయత్నించారు. అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్‌కే కొత్త పాఠాలు నేర్పుతున్నారు. మీడియా సమావేశంలో సీఎం రమేష్ అబద్ధాలతో చేసిన రుబాబు.. వాస్తవాలు ఇవీ...
సీఎం రమేష్: 1998లోనే రిత్విక్ ప్రాజెక్టస్‌ను ప్రారంభించా. అప్పట్లోనే టెండర్లలో రూ.90 కోట్ల విలువైన అవుకు రిజర్వాయర్ పనులు దక్కించుకున్నా.
వాస్తవం: రిత్విక్ ప్రాజెక్ట్స్‌ను 1999లో ప్రారంభించారు. కావాలంటే రిత్విక్ ప్రాజెక్ట్స్ వెబ్‌సైట్ చూసుకోవచ్చు. సీఎం రమేష్ చెప్పినట్టు 1998లో ప్రారంభించిన సంస్థకు.. పనులు చేసిన అనుభవం ఉండదు. అంటే టెండర్లలో పాల్గొనే అవకాశం లేదు. కానీ, చంద్రబాబు అండతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అవుకు రిజర్వాయర్ పనులు దక్కించుకున్న రిత్విక్ ప్రాజెక్ట్స్.. రెండేళ్లలో పూర్తి చేయాల్సిన ఆ రిజర్వాయర్ పనులను 2004 దాకా చేస్తూనే ఉంది. పనులు నాసిరకంగా చేయడం వల్ల రిజర్వాయర్ మట్టికట్టకు పలుమార్లు గండ్లు పడ్డాయి. దాంతో 2004లో ఈ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచుతూ మళ్లీ కొత్తగా పనులు చేయాల్సి వచ్చిందన్న విషయం వాస్తవం కదా?
సీఎం రమేష్: అంచనా వ్యయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉండే పనులను నామినేషన్‌పై ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదు. నేను నామినేషన్‌పై ఒక్క పని కూడా తీసుకోలేదు. నామినేషన్‌పై ప్రాజెక్టుల పనులు తీసుకున్నానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం.
వాస్తవం: 2004 నుంచి 2014 వరకూ రూ.5 లక్షలలోపు విలువైన పనులను మాత్రమే.. అదీ అత్యవసరంగా చేపట్టాల్సిన పనులనే నామినేషన్ విధానంలో కాంట్రాక్టర్లకు అప్పగించే సాంప్రదాయం రాష్ట్రంలో ఉండేది. కానీ, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 నుంచి నిబంధనలను తుంగలో తొక్కారు. రూ.వందల కోట్ల విలువైన పనులను సైతం నామినేషన్ విధానంలో కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారు. నీరు–చెట్టు కింద ఇప్పటిదాకా చేసిన రూ.15,386 కోట్ల విలువైన పనుల్లో 95 శాతం పనులను నామినేషన్‌పైనే జన్మభూమి కమిటీల ముసుగులో టీడీపీ నేతలకు కట్టబెట్టారు. పోలవరం ప్రాజెక్టులో రూ.1,292 కోట్ల విలువైన పనిని నవయుగ సంస్థకు అప్పగించారు. హంద్రీ–నీవా ప్రాజెక్టులో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను టెండర్లలో ఆర్కే–హెచ్‌ఈఎస్–కోయా(జేవీ) సంస్థ రూ.430 కోట్లకు దక్కించుకుంది. నిబంధనల ప్రకారం టెండర్లలో షెడ్యూల్ దాఖలు చేసేటప్పుడే సబ్ కాంట్రాక్టర్ల వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలి. కానీ, అప్పట్లో ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ పనులను రిత్విక్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. కావాలంటే రిత్విక్ ప్రాజెక్ట్స్ వెబ్‌సైట్ చూసుకోవచ్చు. ఆ పనులు సీఎం రమేష్ చేతికి ఎలా దక్కాయి? దొడ్డిదారిన కాదా? ఇవే పనులకు ఇటీవల కేబినెట్‌లో తీర్మానం చేసి మరీ అదనంగా రూ.122.75 కోట్ల బిల్లులు ఇప్పించుకున్న ఘనత సీఎం రమేష్‌కే దక్కింది. హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులలో భారీ ఎత్తున పనులను ఇదే రీతిన దక్కించుకోవడం వాస్తవం కాదా?
సీఎం రమేష్: నేను ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టు పనులు చేయకూడదా? 2014కు ముందు కూడా నేను భారీ ఎత్తున పనులు చేశా. 2014 తర్వాత కేవలం రూ.2,000 కోట్ల విలువైన పనులను.. అదీ టెండర్ల ద్వారా పారదర్శకంగా దక్కించుకున్నా.
వాస్తవం: 2014 వరకూ సీఎం రమేష్ సంస్థ టెండర్లలో పాల్గొన్న దాఖలాలు లేవు. హంద్రీ–నీవాలో 23, 32 ప్యాకేజీలను బ్యాక్‌బోన్ కన్‌స్ట్రక్షన్స్‌ను ముందు పెట్టి.. 33వ ప్యాకేజీ పనులను ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్(ఇండియా)ను ముందు పెట్టి దక్కించుకుని.. వాటిని సబ్ కాంట్రాక్టు కింద చేశారు. 23, 33వ ప్యాకేజీల్లో పనులు చేయకున్నా చేసినట్లు చూపి రూ.9.87 కోట్లకుపైగా అధికంగా బిల్లులు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సీఈ, ఎస్‌ఈ, ఈఈలపై సర్కార్ సస్పెన్షన్ వేటు వేయడం నిజం కాదా? సీఎం రమేష్ చేసిన పాపాలకు బ్యాక్‌బోన్ కన్‌స్ట్రక్షన్స్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన మాట వాస్తవం కాదా? 2014 వరకూ సీఎం రమేష్ సబ్ కాంట్రాక్టర్‌గానే వ్యవహరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పుడు అర్హత ధ్రువీకరణ పత్రాలను సమర్పించి, టెండర్లలో పనులు దక్కించుకున్నారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ విస్తరణ పనుల దగ్గర నుంచి తెలుగుగంగ లైనింగ్ పనుల టెండర్ల వరకూ ఇదే కథ. సీఎం చంద్రబాబు అండదండలతో అక్రమంగా పనులు దక్కించుకున్న మాట వాస్తవం కాదా? వెలిగొండ రెండో టన్నెల్ పనులు కేవలం సీఎం రమేష్‌కు దక్కవనే నెపంతోనే రద్దు చేసి.. రెండోసారి టెండర్లు నిర్వహించి రూ.299 కోట్ల విలువైన పనులను రూ.597.34 కోట్లకు చేజిక్కించుకోవడం నిజం కాదా? సీఎం చంద్రబాబును అడ్డం పెట్టుకుని గత నాలుగున్నరేళ్లలో రూ.3,596.15 కోట్ల విలువైన పనులను దక్కించుకోవడం వాస్తవం కాదా?
సీఎం రమేష్: కాంట్రాక్టు పనుల్లో రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ ఎలాంటి అక్రమాలకు పాల్పడడం లేదు. అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నాం. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నా వ్యాపార సంస్థల్లో ఐటీ సోదాలు చేశారు.
వాస్తవం: కేవలం అంచనా వ్యయం పెంచడం ద్వారానే గత నాలుగున్నరేళ్లలో రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు రూ.1,544.83 కోట్ల ప్రయోజనాన్ని ప్రభుత్వం చేకూర్చింది. అంటే తక్కువ పనులు చేసి ఎక్కువ లాభం పొందారన్న మాట. ఇది అక్రమం కాదా? నెలనెలా చెల్లించాల్సిన వస్తు సేవల పన్నును(జీఎస్టీ)ని రిత్విక్ ప్రాజెక్ట్స్ చెల్లించడం లేదని కమర్షియల్ ట్యాక్స్ అధికారులే చెబుతున్నారు. ఆదాయపు పన్ను ఎప్పటికప్పుడు సక్రమంగా చెల్లిస్తున్నప్పుడు ఐటీ అధికారులు సోదాలు చేస్తే మీకు ఎందుకంత ఉలికిపాటు?
Comments
Please login to add a commentAdd a comment