
సాక్షి, అమరావతి: టీడీపీ రాక్షస పాలనలో మహిళలను రక్షణలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రశ్నించినందుకు తనను ఏడాదిపాటు అసెంబ్లీ నుంచి బహిష్కరించారని మండిపడ్డారు. మంత్రిస్థానంలో ఉండి పరిటాల సునీత మహిళలను వేధించడం దుర్మార్గమన్నారు. రాప్తాడులో కుటుంబ పాలన జరగుతోందని, పరిటాల వర్గీయులు హింసా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మహిళల మంగళసూత్రాలు తెగిపడుతున్నా మంత్రులు సునీత, అఖిలప్రియ స్పందించకపోవడం దారుణమన్నారు.
శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా రోజా మాట్లాడుతూ.. మహిళల వేదింపుల్లో ఏపీని నెంబర్‌వన్‌గా నిలిపిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు. చంద్రబాబుని డాటా బాబాఅని, ఆయన కుమారుడు బేటా బాబా అని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజల సమాచారాన్ని చోరీ చేసిన డేటా, బేటా బాబాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు చెక్కులతో మోసం చేస్తున్నారని, వైఎస్ జగన్‌కు ఆడపడుచులు అండగా నిలవాలని రోజా కోరారు.