ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన
బస్సు, ద్విచక్ర వాహనం ఢీ
Sep 2 2013 3:12 AM | Updated on Aug 30 2018 3:56 PM
రుద్రంపూర్, న్యూస్‌లైన్: ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం కొత్తగూడెం మండలంలోని చుంచుపల్లి పంచాయతీ హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చుంచుపల్లి పంచాయతీ హౌసింగ్ బోర్డులో నివసిస్తున్న బానోత్ మంగ్యా అలియాస్ మంగీలాల్(36) పశువుల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతను స్నేహితుడు భూక్యా భాస్కర్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై సుజాతనగర్‌లోని కోమటిపల్లిలో ఉంటున్న సొదరి ఇంటికి వెళ్లేందుకు ఆదివారం ఉదయం రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
దీంతో మంగీలాల్ ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. భాస్కర్ తీవ్రంగా గాయపడడంతో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంగీలాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్సై వెంకట్రాం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement