ఏం జరుగుతోంది.! | Road construction in Champavathi River | Sakshi
Sakshi News home page

ఏం జరుగుతోంది.!

Published Sun, Jul 23 2017 3:35 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM

Road construction in Champavathi River

సాక్షి ప్రతినిధి, విజయనగరం: చంపావతి నదిలో అడ్డగోలుగా జరుగుతున్న రహదారి నిర్మాణంపై ‘సాక్షి’ ప్రచురిస్తున్న కథనాలపై జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తీవ్రంగా స్పందించారు. నీటిపారుదలశాఖ అధికారుల ఆదేశాలను లెక్క చేయకుండా యథేచ్ఛగా తన పని చేసుకుపోతున్న కాంట్రాక్టర్‌పై క్రిమినల్‌ చర్యలకు రంగం సిద్ధం చేశారు. దానిలో భాగంగా తొలుత డెంకాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. పత్రికలో వరుసగా కథనాలు వస్తుంటే.. ఏం చేస్తున్నారనీ, కాంట్రాక్టర్‌ అంతలాబరితెగిస్తుంటే ఏం చర్యలు తీసుకున్నారని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎం.వెంకటరమణపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈఈకి కలెక్టర్‌ శనివారం స్వయంగా ఫోన్‌ చేశారు. ఇసుక తవ్వకానికి అనుమతి ఉందిగానీ రహదారి నిర్మాణానికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, అయినప్పటికీ కాంట్రాక్టర్‌ చంపావతి నదిలో రోడ్డు వేస్తున్నారని ఈఈ బదులిచ్చారు. ఆ విషయం పత్రికలో రావడంతో వెంటనే వెళ్లి పనులు ఆపమని కాంట్రాక్టరుకు చెప్పామని ఈఈ వివరణ ఇచ్చారు. అయినా రోడ్డు పనులు కొనసాగుతున్నాయని కలెక్టర్‌కు తెలిపారు.

క్రిమినల్‌ కేసుకు ఆదేశం
ఈఈ వివరణపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్‌ పనులు ఆపకపోతే చూస్తూ ఊరుకోవడమేమిటని, వెంటనే కాంట్రాక్టర్‌పై క్రిమినల్‌ కేసు పెట్టమని ఆదేశించారు. రహదారి నిర్మాణం అనుమతికి దరఖాస్తు చేస్తామంటున్నారని ఈఈ చెప్పగా, చేసిన తర్వాత పరిశీలించి నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుందామని, ముందు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. దీంతో ఈఈ సూచనల మేరకు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఏఈఈ) కె.పైడినాయుడు డెంకాడ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం కాంట్రాక్టరు డి.రమేష్‌పై ఫిర్యాదు చేశారు.

విశాఖకు చెందిన రమేష్‌ అనే వ్యక్తి తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నీటి పారుదల శాఖ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా చంపావతి నదిలో రహదారి నిర్మిస్తున్నారని, భోగాపురం ఓపెన్‌ హెడ్‌ చానల్‌ లెఫ్ట్‌ బ్యాంక్‌ లెవిలింగ్‌ చేస్తున్నారని వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. అదే విధంగా నదిలో అక్రమంగా చొరబడుతున్న వాహనాలు, యంత్రాలను సీజ్‌ చేయాల్సిందిగా అందులో పేర్కొన్నారు. డెంకాడ పోలీస్‌ స్టేషన్‌కు అందిన ఫిర్యాదు ఆధారంగా నిందితులపై తక్షణమే కేసు నమోదు చేస్తామని, ఆ మేరకు డెంకాడ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు ఆదేశాలిచ్చామని జిల్లా ఎస్పీ జి.పాలరాజు ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement