పట్టపగలు దోపిడీ | robbery done in ongole at the time morning | Sakshi
Sakshi News home page

పట్టపగలు దోపిడీ

Published Mon, Dec 1 2014 12:28 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

పట్టపగలు దోపిడీ - Sakshi

పట్టపగలు దోపిడీ

ఒంగోలు నగరం నిర్మల్‌నగర్‌లోని సుందర్‌నగర్ రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం భారీ దోపిడీ జరిగింది. 38 సవర్ల బంగారం, రూ.35 వేల నగదు చోరీ చేశారు. చోరీ సొత్తు విలువ రూ.10 లక్షలు ఉంటుందని అంచనా.

ఒంగోలు క్రైం: నగర నడిబొడ్డున ఓ ఇంట్లో ఆదివారం పట్టపగలు దోపిడీ జరిగింది. నిర్మల్ నగర్‌లోని సుందరనగర్ రోడ్డులో ఓ ఉపాధ్యాయుడి ఇంటిని ఇద్దరు యువకులు కొల్లగొట్టారు. మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల మధ్యలో దోపిడీ జరిగింది. దొంగలు 38 సవర్లబంగారం, రూ.35 వేల నగదు దోచుకుపోయారు. చోరీ సొత్తు విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

సుందరనగర్ రోడ్డులోని ఓ డూప్లెక్స్ ఇంట్లో ఎస్‌వీ రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన సూరారెడ్డిపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. రంగారెడ్డి దంపతులు ఉదయం 10 గంటలకు ఇంటికి తాళాలు వేసి ఆస్పత్రికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చే సరికి సరిగ్గా మధ్యాహ్నం 1.30 గంటలైంది. ఇంట్లోకి వెళ్లి చూడగా దోపిడీ జరిగినట్లు అర్థమైంది. కింది అంతస్తు, పైఅంతస్తులోని బిరువాలు బద్దలై ఉన్నాయి. రంగారెడ్డి వెంటనే తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దోపిడీ జరిగిన తీరును పరిశీలిస్తే పక్కా ప్రొఫెషనల్స్ పనై ఉంటుందని అర్థమవుతోంది. నిందితులు ఇద్దరిలో ఒకరు బయట ఉండగా మరొకరు లోనికి వెళ్లి తమ పని కానిచ్చినట్లు తెలుస్తోంది.  దోపిడీ జరిగిన ఇంటిని ఒంగోలు లా అండ్ ఆర్డర్ డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావులు పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరును ఇంటి యజమానులనడికి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాలను గమనించారు. డీఎస్పీల వెంట తాలూకాఎస్సై ఎస్. విజయచంద్రతో పాటు కానిస్టేబుళ్లు ఉన్నారు.

రంగంలోకి దిగిన క్లూస్ టీం
సంఘటన స్థలానికి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించింది. ప్రధాన డోర్‌పై వేలిముద్రలు సేకరించింది. దొంగల ఆధారాల కోసం కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకుంది. ఇంటి పరిశరాలను క్లూస్ టీం సీఐ రాజు నిశితంగా గమనించారు.

నింపాదిగా దొంగల చేతివాటం
దోపిడీకి ముందు ఇంట్లో ఎవరూ లేరని దొంగలు నిర్ధారణకు వచ్చి ఉంటారు. ఇంటికి ఎదురుగా ఖాళీ స్థలం ఉంది. ఉత్తరం వైపున ఫైనాన్స్ కార్యాలయం. దక్షిణం వైపు హరితవనం నర్సరీ కావడం దొంగలు తమ పని సులువుగా చేసుకొని వెళ్లారు. ఫైనాన్స్ కార్యాలయం ప్రహరీ గేటు తీసే ఉంది. దొంగలు అటుగా ప్రవేశించి గోడ దూకి లోనికి వచ్చి చోరీకి పాల్పడి ఉంటారని అక్కడి పరిస్థితులను గమనిస్తే అర్థమవుతోంది.

ఇద్దరు దొంగల్లో ఒకరు వరండాలోని కుర్చీని ప్రధాన ద్వారం ముందు వేసుకొని ఆ కుర్చీపై డోర్‌కట్టన్ ఉంచి ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటికి వెనుక వైపు ఉన్న వారు చెబుతున్న మాటలను గమనిస్తే దొంగలు ఎంతో ప్రశాంతంగా ఇంటిని దోపిడీ చేసుకొని వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement