- ఈ మార్గం మూసి ఉండటంతో తప్పిన ప్రమాదం
- మరిన్ని కూలే అవకాశముందని నిపుణుల అంచనా
తిరుమల
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌లో సోమవారం భారీ బండ కూలింది. ఈ మార్గంలోని 16వ కిలోమీటరు వద్ద సుమారు పది టన్నుల బరువు గల బండ రోడ్డుపై పడింది. తరచూ కొండ చరియలు కూలుతుండటంతో ఈనెల 8వ తేదీ నుంచే ఈ మార్గాన్ని మూసివేశారు. వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ముప్పూ వాటిల్లలేదు. కూలిన బండరాయిని తొలగించటం కష్టం కావడంతో ఆ రాయిని ముక్కలు చేసి తొలగించాలని టీటీడీ ఇంజినీర్లు భావిస్తున్నారు.
ఆదివారం రాత్రి అలిపిరి సమీపంలో మరో భారీ రాయి కూడా కూలింది. ఇదే తరహాలోనే భారీ కొండ చరియలు మరిన్ని కూలే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మార్గంలోని 7 నుంచి 16వ కిలోమీటర్ల పరిధిలో ఇలాంటి ఘటనలు జరగవచ్చని అంచనా వేశారు. ఘాట్‌లో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.