బయ్యారం, న్యూస్‌లైన్: యూపీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో వికలాంగులను పలు రకాలుగా ఆదుకున్నామని, వారికి అందించే పింఛన్‌ను రాబోయే రోజులలో రూ.1200కు పెంచుతామని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారితశాఖ మంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. మంగళవారం బయ్యారంలో అలెంకో(ఆర్టిఫిషియల్ లింక్స్ మ్యాన్‌ఫాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంస్థ సౌజన్యంతో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన 217 మంది వికలాంగులకు పలు పరికరాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. వికలాంగుల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. మండలంలో ప్రధాన నీటివనరులైన బయ్యారం పెద్ద చెరువు కాల్వల మరమ్మతులకు రూ 30 లక్షలు, తులారాం ప్రాజెక్టు కాల్వలకు రూ. 3.20 కోట్ల నిధులు విడుదలయ్యాయని చెప్పారు.
వచ్చే వేసవిలో పనులు ప్రారంభమవుతాయన్నారు. ఇనుపరాయి గనులున్న బయ్యారంలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ముఖ్యమంత్రి ఎన్‌ఓసీ ఇవ్వటంలోనే జాప్యం జరుగుతోందని తెలిపారు. ఈ పరిశ్రమ స్థాపనకు ఎన్‌ఓసీ ఇవ్వాలని ఆయన సీఎంను కోరారు. ఇల్లెందు- గుండాల మధ్య రూ.100 కోట్లతో రహదారిని నిర్మిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి ఆధ్వర్యంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీడీఓ చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో అలెంకో సంస్థ సీఎండీ నారాయణరావు, కొత్తగూడెం ఆర్డీఓ అమయ్‌కుమార్, వికలాంగుల శాఖ ఏడీ మున్నయ్య, మండల ప్రత్యేకాధికారి శోభన్‌బాబు, తహశీల్దార్ పుల్లయ్య, సొసైటీ అధ్యక్షుడు బిక్షం తదితరులు పాల్గొన్నారు.
వికలాంగులకు రూ.1200 పింఛన్ ఇస్తాం
Published Wed, Jan 8 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:22 AM
Advertisement
Advertisement