బనగానపల్లె టౌన్, న్యూస్‌లైన్ : ఆర్యవైశ్య కుటుంబాల్లో ఆడపిల్లల జననాలను ప్రోత్సహించేందుకు ఆర్యవైశ్య మండల మహాసభ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మండలంలోని పేద ఆర్యవైశ్య కుటుంబాల్లో ఆడబిడ్డ పుడితే రూ.5వేలు డిపాజిట్ చేస్తామని ప్రకటించింది. వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేస్తామని సంఘం మండల అధ్యక్షుడు తెలిపారు. స్థానిక శ్రీవాసవీ కన్యక పరమేశ్వరీ దేవి ఆలయంలో ఆదివారం మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 11 మంది పేద ఆర్యవైశ్య మహిళలకు కుట్టుమిషన్లు, గ్రైండర్ మిషన్ పంపిణీ చేశారు. మహాసభ మండల అధ్యక్షుడు డి. వెంకటసుబ్బయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య మాట్లాడుతూ వ్యాపారాలతోపాటు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొని తోచిన మేరకు సాయం చేయలని ఆర్యవైశ్యులకు పిలుపునిచ్చారు.
ఐక్యంగా ఉంటూ సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు తెచ్చుకోవాలని, అప్పుడే రాజకీయంగా కూడా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. బనగానపల్లె ఆర్యవైశ్య సంఘం వారు ఆర్థికంగా వెనుకబడ్డ ఆర్యవైశ్య కుటుంబాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వడంతోపాటు ఇతరత్రా ఆదుకుంటుండడం మంచి పరిణామన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు పెండేకంటి కిరణ్‌కమార్ మాట్లాడుతూ వ్యాపారాలు ఒక్కటే పరమార్థం కారాదని, ఇతరులకు సేవ చేయడం కూడా బాధ్యతగా స్వీకరించాలన్నారు. డి.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ పేద ఆర్యవైశ్య కుటుంబాల్లో ఆడబిడ్డ పుట్టిన వెంటనే బ్యాంకులో ఖాతా ప్రారంభించి రూ. 5వేలు డిపాజిట్ చేస్తామని తెలిపారు. అనంతరం 11 కుట్టు మిషన్లు, ఒక గ్రైండర్ మిషన్‌ను ఆర్యవైశ్య మహిళలకు సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
సొంతంగా పింఛన్ల పంపిణీ : కుట్టు మిషన్ల పంపిణీ సందర్భంగా మండల అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య రూ. 200 ప్రకారం సొంతంగా నలుగురికి పింఛన్లు అందజేశారు. తాను మండలాధ్యక్షులుగా ఉన్నంత కాలం పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు ఇల్లూరి సుధాకర్, బాలసుబ్రమణ్యం, బి.సత్యంశేట్టి, జి.వేణుగోపాల్‌శెట్టి, పీఎస్‌ఎస్ నారాయణ, గుండా శ్రీనివాసులు, రామకృష్టయ్య, శ్రీనివాసులు, హరిప్రసాద్, నూకల వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.