రూ.72 పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
Published Thu, Oct 3 2013 4:57 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: నగదు బదిలీ పథకం కింద ఆధార్‌తో గ్యాస్ కనెక్షన్‌ను అనుసంధానం చేసుకున్న వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ గుదిబండగా మారింది. ఇప్పటికే ఆధార్ అనుసంధానం చేసుకోని వారికంటే అనుసంధా నం చేసుకున్న వినియోగదారులు సిలిండర్‌ను ఎక్కువ ధరకు విడిపించుకోవాల్సి వస్తోంది. ఇది చాలదన్న ట్లు సడీచప్పుడు లేకుండా ఎడాపెడా ధరలు పెంచేస్తున్నారు. తాజాగా వినియోగదారులకు తెలియకుండానే సిలిండర్ ధరను రూ.72 పెంచేశారు. నిన్నటి వరకు గ్యాస్ సిలిండర్ ధర రూ.998 ఉండగా, బుధవారం నుంచి అమాంతం రూ.1070కి పెంచారు. ఇంతకుముందు చమురు సంస్థలు, కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచుతున్నట్లు ముందుగానే ప్రకటించేవి. ఇప్పుడు అలా చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. నగదు బదిలీ పథకం జిల్లాలో అమలవుతుండటం వల్ల గ్యాస్ సిలిండర్ ఇంటికి చేరినప్పుడే ధర పెరిగిన విషయం వినియోగదారులకు తెలుస్తోంది.
దీనివలన సామాన్య వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ వస్తుందని రూ.1000 సిద్ధంగా ఉంచుకున్న వినియోగదారులు.. తీరా ధర పెరగడంతో అదనపు సొమ్ము కోసం చుట్టుపక్కల ఇళ్లకు పరుగులు తీయాల్సి వస్తోంది. మరోవైపు ఇళ్లకు గ్యాస్ సరఫరా చేసే కొందరు సిబ్బంది సిలిండర్ మరో రూ.20 ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు ఈ నెలలో దసరా మామూళ్లు అంటూ రూ.50 నుంచి రూ.100 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా కలుపుకొని సిలిండర్ విడిపించాలంటే రూ.1150 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఇప్పటికే సమైక్య ఉద్యమంలో ఉన్న ఉద్యోగులు రెండు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రభావం మిగిలిన రంగాలపైనా పడి ఆర్థికంగా అవస్థలు పడుతుండగా, గ్యాస్ ధర పెరుగుదల అన్ని వర్గాల వారికి మరింత భారమైంది. ఇదిలా ఉంటే పెరిగిన గ్యాస్ ధరల వలన ఆధార్ కార్డును అనుసంధానం చేయించుకున్న వినియోగదారులే తీవ్రంగా నష్టపోతున్నారు.
వీరు రూ.1070 వెచ్చించి గ్యాస్‌ను విడిపించుకుంటే సబ్సిడీగా బ్యాంకులో రూ.435 మాత్రమే జమ అవుతుంది. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు మాత్రం తొలిసారి రూ.435 జమ అవుతుందని, రెండోసారి నుంచి రూ.535 చొప్పున ఖాతాకు జమ అవుతాయని చెబుతున్నారు. ఇది వాస్తవమో కాదో తెలియడం లేదు. ఇప్పటివరకు ఏ ఒక్కరికి ఈ మొత్తం జమ కాలేదు. ఒకవేళ ఏజన్సీ ప్రతినిధులు చెబుతున్నట్లుగా రూ.535 బ్యాంకు ఖాతాకు జమ అయినా వినియోగదారులు రూ.1070 చెల్లిస్తున్నందున సిలిండర్‌ను రూ.535కు కొనుగోలు చేస్తున్నట్లు అవుతుంది. అనుసంధానం చేయించుకోని వినియోగదారులకు మాత్రం రూ.411కే సిలిండర్ సరఫరా చేస్తున్నారు. దీంతో అనుసంధానం చేయించుకున్న వినియోగదారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
కాగా, ఆధార్ అనుసంధానం చేయించుకోని వినియోగదారులు ఈ నెల వరకే లబ్ధి పొందుతారని, ఆ తర్వాత వారికి కూడా గ్యాస్ సంస్థలు నిర్ణయించిన ధరకే సరఫరా చేస్తామని ఏజెన్సీలు చెబుతున్నాయి. ఏదైనా మూడు నెలలకు పైగా గ్యాస్ అనుసంధానం చేయించుకోని వినియోగదారులు లబ్ధి పొందినట్లు అవుతుందని, తాము ముందుగా అనుసంధానం చేయించుకోవడం ద్వారా కోరి కష్టాలు తెచ్చుకున్నామని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement