రయ్.. రయ్..! | RTA strictly checking on private vehicles | Sakshi
Sakshi News home page

రయ్.. రయ్..!

Published Sat, Nov 2 2013 2:30 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

RTA strictly checking on private vehicles

ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి జిల్లా సరిహద్దులో ఉన్న భోరజ్ చెక్‌పోస్టు మీదుగా గురువారం రాత్రి డైమండ్, కన్కర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు వెళ్తుండగా ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. వాటి పర్మిట్‌లను పరిశీలించగా కాంటాక్ట్ క్యారేజ్ అనుమతి ఉండగా, స్టేజ్ క్యారేజ్‌గా వెళ్తున్నట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆర్టీ ఏ అధికారులు ఆ ట్రావెల్స్‌పై కేసు నమోదు చేశారు. బస్సులను కోర్టుకు తరలించా రు. కాంటాక్ట్ క్యారేజ్ అనుమతి ఉన్న బస్సులు పెళ్లిళ్లు, విహార యాత్రలకు ఒకే పార్టీని తీసుకెళ్లాలి. ఈ అనుమతి పొంది ఈ రెండు బస్సులు ప్రయాణికులను తీసుకెళ్తూ నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వయా ఆదిలాబాద్ మీదుగా వెళ్తున్నాయి. విచిత్రమేమిటంటే ఈ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు రోజు ఇదే మార్గం గుండా వెళ్లా యి. పాలమూరు ఘటనతో అధికారులు మేల్కొని సీజ్ చేశారు. లేకపోతే మామూళ్ల మత్తులో జోగేవారు. ఇంకా రోజు తనిఖీలు చేస్తున్నామని, ఏడు నెలల్లో వందకుపైగా కేసులు నమోదు చేశామని రవాణా శాఖ అధికారులే పేర్కొనడం విశేషం. జిల్లాలో 15 ప్రైవేట్ బస్సులు ఉన్నాయని, అన్నీ కూడా నిబంధనల మేరకు తిరుగుతున్నాయని, పర్మిట్లు, డ్రైవింగ్ లెసైన్స్ ఉన్నాయని చెప్పడం కొసమెరుపు.
 యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన..
 ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే ట్రావెల్స్ అధికంగా ఉన్నాయి. మంచిర్యాల, కాగజ్‌నగర్ తదితర ప్రాంతాల్లో రైల్వే సదుపాయాలు విస్తృతంగా ఉండడంతో అంతగా లేవు. జిల్లా కేంద్రంలో ముస్కాన్, హెచ్‌కేజీఎన్, జైమాతాదీ, శ్రావణ్, డైమండ్, ఆరేంజ్, వంశీ తదితర ట్రావెల్స్ ఉన్నాయి. వీటిలో పలు ట్రావెల్స్ కాంటాక్ట్ క్యారేజ్ అనుమతి తీసుకొని యథేచ్ఛగా స్టేజ్ క్యారేజ్‌గా తిరుగుతున్నాయి. కాంటాక్ట్ క్యారేజ్‌లో ఒక్కో సీట్‌కు ప్రతి మూడు నెలలకు రవాణ శాఖకు రూ.874 పన్ను చెల్లించాలి. కేవలం పెళ్లి బృందాలు, విహార యాత్రలకు మాత్రమే వీటిని ఉపయోగించాలి. అయితే కాంటాక్ట్ క్యారేజ్ పర్మిట్‌తో రాత్రి సర్వీసులుగా హైదరాబాద్, నాగ్‌పూర్ ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నారు. రెండు రోజులుగా ఆర్టీఏ అధికారులు హల్‌చల్ చేస్తుండటంతో బస్సులను బయటకు తీయడం లేదు. నాగ్‌పూర్ నుంచి బయలుదేరే డైమండ్ ట్రావెల్స్ బస్సు ఆదిలాబాద్ బస్టాండ్‌లో నిత్యం ప్రయాణికులను తీసుకుని హైదరాబాద్ వెళ్తుంది. దీనికి నేషనల్ పర్మిట్ లేకున్నా మన రాష్ట్రంలో ప్రవేశించి యథేచ్చగా ప్రయాణికులను తీసుకెళ్తుండటం గమనార్హం. ఇక ఆదిలాబాద్ నుంచి వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ 30 సీట్లకు అనుమతి తీసుకుని 40 మంది ప్రయాణికులను తీసుకెళ్తుంటాయి. కానీ, ఈ తతంగం అధికారులకు కనిపించదు.
 గూడ్స్ ట్రావెల్సే..
 ప్రయాణికులను తీసుకెళ్లడంలోనే అడ్డదారులు తొక్కుతున్న ట్రావెల్స్ యజమానులు అవే బస్సు వెనుక భాగంలో ఉన్న క్యాబిన్‌లలో టన్నుల కొద్ది బరువైన లగేజ్‌ను తరలిస్తూ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాయి. వాటితో నిత్యం ఒక్కో బస్సు ద్వారా రూ.15వేల నుంచి రూ.20వేల ఆదాయం గడిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ వ్యాపారాలకు ఈ బస్సులు అడ్డాగా మారుతున్నాయి. నిషేధిత గుట్కాలు ఈ బస్సుల్లో తీసుకొస్తుండగా పోలీసులు పలుమార్లు పట్టుకున్నారు. కానీ బస్సులను సీజ్ చేయకుండా మామూలుగా తీసుకొని వదిలిపెట్టారన్న విమర్శలు లేకపోలేదు. ఇలాంటి అక్రమ దందాలతో ఏదైన ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులన్న ప్రశ్న తలెత్తుతోంది.
 
 జిల్లాలో విస్తృతంగా తనిఖీలు..
 మహబూబ్‌నగర్ ఘటన జరగక ముందే అంటే జిల్లాలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వంద ట్రావెల్స్‌లపై కేసులు నమోదు చేయడం జరిగింది. నిరంతరం తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.
 - ప్రవీణ్‌రావు,
 డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement