కర్నూలు, న్యూస్‌లైన్: మృత్యువు చేల‘రేగింది’. 45 మందిని పొట్టన పెట్టుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్న ప్రైవేట్ బస్సు ఘటనతో ఇప్పుడు ఆ వాహనాలంటేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదేమోననే చర్చతో వారిలో కదలిక వచ్చింది. అయితే వీరు ఎంతకాలం ఇలా తనిఖీలుతో సంబంధిత యాజమాన్యాలను దారిలోకి తీసుకొస్తారనేది ప్రశ్నార్థకం. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు కర్నూలు నగర శివారులోని టోల్‌ప్లాజా వద్ద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పర్మిట్ల గడువు ముగిసినప్పటికీ అక్రమంగా తిప్పుతున్న నాలుగు బస్సులను సీజ్ చేశారు. రీ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా తిప్పుతున్న మరో నాలుగు బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సు రిజిస్ట్రేషన్ల కాగితాలు, డ్రైవర్ల లెసైన్స్‌లతో పాటు అధిక లోడ్ వివరాలను పరిశీలించారు. రవాణా శాఖ ఉప కమిషనర్ శివరాంప్రసాద్ నేతృత్వంలో మోటారు వాహనాల తనిఖీ అధికారులు చంద్రబాబు, రమణ, శ్రీనివాసులు, శేషాద్రి, ఏఎంవీఐలు శివలింగయ్య, రాజేశ్వరరావు, రవిశంకర్ నాయక్, నారాయణ నాయక్, కుసుమ, జయశ్రీ, విజయకుమారి తదితరులు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు.
సహారా ట్రావెల్స్‌కు సంబంధించిన బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా తనిఖీ చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి బళ్లారికి వెళ్తున్న దివాకర్ ట్రావెల్స్.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న పీయూఎన్ ట్రావెల్స్, బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఏపీ టూరిస్ట్ ట్రావెల్స్ వాహనాలను పరిశీలించారు. పర్మిట్ల గడువు ముగిసినట్లు తనిఖీల్లో తేలడంతో కేసులు నమోదు చేశారు. అలాగే రీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి మూడు వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. వాహనాల క్రయవిక్రయాల సందర్భంగా 12 మాసాల్లోపు రిజిస్ట్రేషన్ బదలాయించి నంబర్లు మార్చుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న(కర్ణాటక) బస్సులను తనిఖీ చేసి రీ అసైన్‌మెంట్ కింద కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు(మర్చంటైల్ గూడ్స్) టాప్‌పైన అధిక లోడుతో వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేసి కేసు కట్టారు. వీటికి సంబంధించి దాదాపు రూ.2 లక్షల అపరాధ రుసుముతో పాటు ప్రాసిక్యూషన్ కోసం కోర్టుకు అప్పగించేందుకు వాహనాలు సీజ్ చేసి కొత్త బస్టాండ్ సమీపంలోని ఆర్టీసీ డిపోకు తరలించారు.
అదేవిధంగా నంద్యాలలో ఆర్టీఓ వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో మోటారు వాహనాల తనిఖీ అధికారి వెంకటేశ్వరరావు, రాజబాబు, శివకుమార్, అనిల్‌కుమార్ నేతృత్వంలో మరో బృందం నంద్యాల జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించి 12 కేసులు నమోదు చేసింది. ఈ సందర్భంగా డీటీసీ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులో ఇద్దరు డ్రైవర్లను కచ్చితంగా నియమించుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహన యజమానులపై కఠిన చర్యలు తప్పవని, తనిఖీలు నిరంతరాయంగా కొనసాగిస్తామని హెచ్చరించారు.