పాడేరు రూరల్: గుండెపోటు వచ్చినా ప్రయాణికుల ప్రాణాలే ముఖ్యమనుకున్న ఆర్టీసీ డ్రైవర్ వారిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చి చివరకు మృత్యువు ఒడిలోకి జారుకున్న విషాదకర ఘటన విశాఖ జిల్లా పాడేరులో శనివారం జరిగింది. ఇదే జిల్లా నాతవరానికి చెందిన ఈఎస్.నారాయణ పాడేరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం పాడేరు–అరుకు మార్గంలో నైట్‌డ్యూటీ విధులకు వెళ్లాడు. తిరిగి శనివారం మధ్యాహ్నం అరుకు నుంచి పాడేరుకు 40 మంది ప్రయాణికులతో వస్తుండగా పాడేరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో చింతలవీధికి చేరుకునే సరికి డ్రైవర్ నారాయణకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది.
దాన్ని భరిస్తూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చాలన్న ఉద్దేశంతో బస్సును పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు చేర్చి సంతకం పెట్టి డ్యూటీ దిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి సిబ్బంది అతడిని వెంటనే స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చూరిలో భద్రపరిచి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతుడు నారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రయాణికులను గమ్యానికి చేర్చి తుది శ్వాస
Published Sun, Oct 28 2018 1:13 PM | Last Updated on Sun, Oct 28 2018 1:19 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment