రెండో రోజూ కొనసాగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె
డిపో కార్యాలయాల ఎదుట వెల్లువెత్తిన ఆందోళనలు
పోలీస్ బందోబస్తు నడుమ రోడ్డెక్కిన బస్సులు
పాక్షికంగానే రవాణా సేవలు
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) :వేతన సవరణ చేయాలని, 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. సర్కారుతో అమీతుమీ తేల్చుకుంటామని, డిమాం డ్లను ఆమోదించేంత వరకూ సమ్మె ను విరమించేది లేదని కార్మిక సం ఘాల నాయకులు స్పష్టం చేశారు. సమ్మె నేపథ్యంలో బుధవారం కేవలం 8 బస్సులను మాత్రమే నడిపిన అధికారులు గురువారం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సుమారు 276 బస్సులను తిప్పగలిగారు. వీటిలో 189 బస్సులు ఆర్టీసీకి చెందినవి కాగా, మరో 87 అద్దెబస్సులు ఉన్నాయి.
ఏలూరు డిపోపరిధిలో 51 ఆర్టీసీ, 36 అద్దె బస్సులు, జంగారెడ్డిగూడెం డిపో పరిధిలో 30 ఆర్టీసీ, 15 అద్దె బస్సులు, తాడేపల్లిగూడెంలో 12 ఆర్టీసీ, 8 అద్దె బస్సులు, భీమవరంలో 26 ఆర్టీసీ, 9 అద్దె బస్సులు, నరసాపురంలో 26 ఆర్టీసీ, 7 అద్దె బస్సులు, తణుకులో 24 ఆర్టీసీ, 12 అద్దె బస్సులు, కొవ్వూరులో 20 ఆర్టీసీ బస్సులు నడిచాయి. అద్దె బస్సుల యజమానులు రూ.100 చొప్పున పర్మిట్ చార్జీలు చెల్లించి లాభసాటి మార్గాల్లో ప్రయాణించగా, ఆర్టీసీ బస్సులు మాత్రం ప్రజావసరాలను దృష్టిలో పెట్టుకుని పల్లె వెలుగు రూట్లలో వెళ్లాయి. ఆర్టీసీ బస్సుల్లో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు విధులు నిర్వర్తించగా, ప్రతి బస్సుకు ఒక పోలీస్ కానిస్టేబుల్‌ను ఎస్కార్ట్‌గా పంపించారు.
కొనసాగిన ఆందోళనలు
బుధవారం 38 మంది ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసి, కేసులు నమోదు పెట్టినా రెండో రోజున కార్మికులు వెనక్కి తగ్గలేదు. ఉదయాన్నే ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకుని ధర్నాలు నిర్వహించారు. ఆర్టీసీ యాజమాన్యానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
వందలాదిగా వచ్చిన నిరుద్యోగులు
సమ్మె కారణంగా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులు నడుపుతామని, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆయా డిపోల్లో అధికారులను సంప్రదిం చాలని కలెక్టర్ కె.భాస్కర్ బుధవారం చేసిన ప్రకటనతో నిరుద్యోగులు ఉదయం 6గంటలకే వందలాదిగా ఆర్టీసీ డిపోల వద్దకు చేరుకుని బారులు తీరారు. తొలుత వారినుంచి సర్టిఫికెట్లు సేకరించిన అధికారులు వాటిని పరిశీలించి ఒక్కొక్కరినీ పిలిచి బస్సులు అప్పగించారు. ప్రతి డిపో వద్ద వందలాది మంది అభ్యర్థులు వేచి ఉండగా, జిల్లావ్యాప్తంగా కేవలం 552 మందికే అవకాశం లభించడంతో మిగిలిన వారు నిరుత్సాహంతో వెనుదిరిగారు.
ప్రయాణికులకు పెరిగిన ఇబ్బందులు
కలెక్టర్ ప్రకటనతో సులభంగా ప్రయాణం చేయవచ్చనే ధీమాతో రోడ్లపైకి వచ్చిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉదయం 9 గంటల తరువాత గాని బస్సులు బయటకు రాలేదు. మరోవైపు ప్రైవేటు ఆపరేటర్లు రెట్టింపు చార్జీలను వసూలు చేశారు. మొత్తానికి ప్రయాణికులు ఇబ్బందులు తప్పలేదు.
కాంట్రాక్ట్ కార్మికుల సేవలు క్రమబద్ధీకరణ
సమ్మె నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించే అవకాశాలు మెరుగయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలలోపు తన కార్యాలయంలో రిపోర్టు చేసే కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులర్ చేస్తామని రీజినల్ మేనేజర్ ఆర్.రామారావు ప్రకటించారు. రిపోర్టు చేయని కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులర్ చేసే అవకాశాలు పూర్తిగా మూసుకుపోతాయన్నారు. రీజియన్ పరిధిలో 141 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, 61 మంది కాంట్రాక్టు కండక్టర్లు ఉన్నట్టు ఆయన చెప్పారు.
తాడో.. పేడో
Published Fri, May 8 2015 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM
Advertisement
Advertisement