అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : ఆర్టీసీ రథ చక్రాలు రోడ్డెక్కాయి. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో శనివారం నుంచి విధుల్లో చేరారు. జిల్లాలోని 12 డిపోల్లో ఉదయం 5.30 గంటల నుంచే బస్సులు తిరిగాయి. 74 రోజుల సమ్మె తర్వాత కార్మికులు రెట్టించిన ఉత్సాహంతో విధుల్లో కనిపించారు. అనంతపురంలో సీటీఎం మధుసూదన్, డీఎం రమణ నేతృత్వంలో బస్సుల కండీషన్‌ను చెక్ చేసి పంపించారు.
బస్సుల కండీషన్ గురించి మెకానికల్ ఫోర్‌మన్ నారాయణస్వామిని అడిగి తెలుసుకున్నారు. అనంతపురం డిపో నుంచి మధ్యాహ్నం 12 గంటల సమయంలో 74 సర్వీసులు పంపాల్సి ఉండగా, 69 సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారన్న సమాచారం తెలియగానే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో బస్టాండ్‌కు చేరుకున్నారు. రెండున్నర నెలలపాటు కళావిహీనంగా ఉన్న బస్టాండ్ ఆవరణం ప్రయాణికుల రాకతో సందడిగా కనిపించింది.
బస్టాండ్, డిపోను తనిఖీ చేసిన
ఆర్‌ఎం
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్, డిపోను ఆర్‌ఎం జి.వెంకటేశ్వర రావు తనిఖీ చేశారు. డిప్యూటీ సీటీఎం మధుసూదన్, సీఐ వినయ్‌కుమార్, రాజవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలుగుకుండా ఏర్పాట్లు చేశారు. పాయింట్లలో సకాలంలో బస్సులు ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఆర్‌ఎం మాట్లాడుతూ రెండు నెలలుగా బస్సులు తిరగగపోవడం కండీషన్‌పై ప్రభావం ఉంటుందన్నారు. ఉదయం నుంచి 70 శాతం బస్సులను తిప్పామన్నారు. పూర్తిస్థాయిలో బస్సులు తిప్పేందుకు మరో మూడు రోజుల సమయం పడుతుందన్నారు.
ఆర్టీసీ విలీనంపై సంబరాలు
ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు రంగం సిద్ధమవడంతో కార్మికులు సంబరాలు చేసుకున్నారు. శనివారం అనంతపురం డిపో ఆవరణలో కార్మికులు యూనియన్‌లకతీతంగా బాణాసంచ పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం అధికారులు, కార్మికులు స్వీట్లు పంచుకున్నారు. కొంత మంది కార్మికులు నృత్యాలు చేశారు. జై సమైక్యాంధ్ర...జైజై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు ఖాన్, వీఎన్ రెడ్డి, సీఎన్ రెడ్డి, మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ విలీన ప్రక్రియను వంద రోజుల్లో పూర్తి చేయాలని కోరారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆర్‌పీ రావు, వాసుదేవరెడ్డి, కొండయ్య, శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్, రవీందర్, చెన్నారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డెక్కిన ప్రగతి రథ చక్రాలు
Published Sun, Oct 13 2013 2:55 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement