ఒంగోలు : దివ్యాంగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ రాయితీపై బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తోంది. వివిధ రకాల వైకల్యాల ఆధారంగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు 50 శాతం రాయితీతో బస్‌పాస్‌లు అందిస్తోంది.
ప్రత్యేక మేళాలు...
దివ్యాంగుల కోసం ప్రస్తుతం ఒంగోలు ఆర్టీసీ బస్టాండులో ఆన్‌లైన్ ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటరులో బస్ పాస్ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే త్వరలోనే అన్నిప్రాంతాల్లో ప్రత్యేక మేళాలు ఏర్పాటు చేయనున్నట్లు ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు.
బస్ పాస్ పొందేందుకు ఇవీ అర్హతలు...
ఎముకలు సంబంధిత వైకల్యం 40 శాతం, పోలియో, పెరాలసిస్‌కు సంబంధించి 40 శాతం, మూగ, చెవుడు, అంధత్వం 100 శాతం, బుద్దిమాంధ్యం 50 శాతం కలిగిన వారికి ఈ రాయితీ బస్ పాస్ అందిస్తున్నారు. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఈ రాయితీ ద్వారా దివ్యాంగులు ప్రయాణించవచ్చు. ఇంటర్‌స్టేట్ బస్సులు, అల్ట్రా డీలక్స్, సూపర్‌లగ్జరీ బస్సులకు ఈ సౌకర్యం వర్తించదు. అంధత్వం ఉన్నవారికి, మరో సహాయకునికి కూడా 50 శాతం రాయితీ కల్పిస్తారు.
దరఖాస్తు ఇలా...
ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే దివ్యాంగులు తమ అంగవైకల్యం ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్‌కార్డు జెరాక్స్, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను ఆర్టీసీ ఆన్‌లైన్ కౌంటర్‌లో లేదా ఆర్టీసీ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. లేదా ప్రత్యేక మేళాలు నిర్వహించే సమయంలో ఆర్టీసీ అధికారులకు వీటిని సమర్పించడం ద్వారా పొందవచ్చు.
ఆర్టీసీ బస్సు టికెట్ల రద్దుకు నిబంధనలు...
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు ముందుగా తాము బుక్ చేసుకున్న టికెట్లను రద్దుచేసుకునేందుకు కొన్ని పరిమితులు విధించారు. నిర్ణీత సమయాల ప్రకారం బుక్‌చేసుకున్న టికెట్లలో కొంతమొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తం ఇస్తారు. వాటికి సంబంధించిన నిబంధనలు ఇలా ఉన్నాయి...
= బస్సు బయలుదేరడానికి 48 గంటల కంటే ముందుగా రద్దుచేసుకుంటే రిజర్వేషన్ చార్జీ మినహా మిగిలిన మొత్తం చెల్లిస్తారు
= 24 గంటల నుంచి 48 గంటల మధ్య సమయంలో రద్దుచేసుకుంటే 10 శాతం వాస్తవ ఫేర్‌తో పాటు రిజర్వేషన్ చార్జీని మినహాయిస్తారు.
= 2 గంటల నుంచి 24 గంటల మధ్యలో రద్దుచేసుకుంటే 25 శాతం వాస్తవ ఫేర్‌తోపాటు రిజర్వేషన్ చార్జీని మినహాయిస్తారు
= 1 గంట నుంచి 2 గంటల మధ్యలో అయితే 50 శాతం వాస్తవ ఫేర్‌ను, రిజర్వేషన్ చార్జీని మినహాయిస్తారు
= 1 గంటలోపు అయితే ఎటువంటి మొత్తం వాపసు ఇవ్వబడదు.
దివ్యాంగులకు ఆర్టీసీ బస్‌పాస్‌లు
Published Fri, Jun 2 2017 1:07 AM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM
Advertisement
Advertisement