
అగ్రహా జ్వాల
ఆర్టీసీ చార్జీల పెంపుపై వైఎస్సార్‌సీపీ ఆందోళన
జిల్లా అంతటా బస్టాండ్ల ఎదుట ధర్నాలు, రాస్తారోకోలు
స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజలు
పట్నంబజారు(గుంటూరు): సామాన్యులపై పెనుభారాన్ని మోపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలు పెంచడంపై జిల్లా అంతటా ఆగ్రహ జ్వాలలు రగిలాయి. చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పెద్దఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని కదం తొక్కారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఉద్యమించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు మంగళగిరి బస్టాండ్ ఎదుట ధర్నా చేపట్టి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు బస్టాండ్ వద్ద గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తూ బస్టాండ్ వద్దకు చేరుకుని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పొన్నూరులో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటరమణ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. సత్తెనపల్లిలో పార్టీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌మాబు, కె.ప్రభాకర్ తదితర నేతల ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కౌన్సిలర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చిలకలూరిపేటలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవీఎం సుభాని ఆధ్వర్యంలో పార్టీ కౌన్సిలర్లు, పలు విభాగాల నేతలు బస్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. వినుకొండలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి పార్టీ నేతలు, కౌన్సిలర్, మండలాధ్యక్షులు ప్రదర్శన నిర్వహిస్తూ బస్టాండ్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల అనంతరం నేతలు ఆర్టీసీ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు.