
డీసీఐలో వాటాలు అమ్మకండి
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీ (డిసిఐ) ఈక్విటీలో మెజారిటీ వాటా వ్యూహాత్మక అమ్మకాలకు ప్రభుత్వం నిర్ణయించిందన్న వార్తలపై వైఎస్‌ఆర్ సీపీ పార్టీ ఎంపీ (రాజ్యసభ్యుడు) వి. విజయ సాయి రెడ్డి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లోని తన విశాఖ నోడల్ జిల్లాలో, ప్రపంచంలో టాప్ టెన్ కంపెనీల్లో ఒకటిగా వెలుగొందుతున్న డీసీఐ లో 51శాతం ప్రభుత్వ వాటా విక్రయంపై ఆందోళన వ్యక‍్తం చేశారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. శాశ్వతంగా నష్టాల్లో కూరుకుపోయిన సంస్థకు బదులుగా లాభాలతో ఆదాయాన్ని ఆర్జిస్తున్న కంపెనీలో వాటా విక్రయంపై ఆందోళన వ్యక‍్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మినీ రత్నగా, నావీ రంగంలో, పోర్ట్ సెక్టార్ లో డ్రెడ్జింగ్ అవసరాలను తీరుస్తున్న డీసీఐలో పెట్టుబడుల ఉపసంహరణపై విజయ సాయి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
జాతీయ మరియు అంతర్జాతీయ ఒప్పందాలు ద్వారా లాభాలను గడిస్తున్న సంస్థ తాజాగా బంగ్లాదేశ్ మంగోలా ఓడరేవుతో ఒప్పందాన్ని కుదుర్చుకుందన్నారు. ప్రభుత్వ వాటా విక‍్రయ వార్తలతో కంపెనీ షేరు 26.53శాతం పతనానికి దారి తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1976 లో విశాఖలో ఏర్పాటైన డీసీఐ ప్రస్తుతం రూ.680 కోట్ల టర్నోవర్ తో గత ఏడాది రూ. 80 కోట్ల లాభాలను సాధించిందని చెప్పారు.
అత్యంత లాభాలతో నడుస్తున్న కంపెనీని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టడం సరైందికాదన్నారు. దీంతో త్రవ్వకాల ధరలు భారీగా పెరగడంతోపాటు, 600 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా రోడ్డుపడతారన్నారు. ఈ విషయాలను పరిశీలించి బలమైన, లాభాలతో నడుస్తున్న కంపెనీలో పెట్టుబడుల ఉపసంహరణపై ఇకనైనా ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.