ఆర్టీసీలో శ్రమ దోపిడీ
Published Tue, Oct 1 2013 1:52 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
మిర్యాలగూడ టౌన్, న్యూస్‌లైన్ :పట్టణంలోని ఆర్టీసీ డిపోలో సుమారు 30 మంది వరకు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులు పని చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికులకు జీతం తక్కువగా ఇస్తూ వారితో వెట్టిచాకిరీని చేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. 10 సంవత్సరాలుగా ఈ డిపోలో ఔట్ సోర్సింగ్ కార్మికులు పని చేస్తున్నప్పటికీ నేటికీ వారిని పర్మనెంటు చేయడం లేదని పలువురు కార్మికులు పేర్కొంటున్నారు. డీఎం కార్యాలయంతో పాటు గ్యారేజీవర్కర్లు, స్వీపర్లు, బస్సులను శుభ్రం చేసేవారికి కనీస వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికులకు పీఎఫ్ గత కొంత కాలంగా చెల్లించడం లేదు. ఈఎస్‌ఐ సౌకర్యం కూడా కల్పించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందాల్సిన ఇతర సౌకర్యాలు కూడా అందడం లేదు. 2012 జూన్ 27వ తేదీన ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఏకే ఖాన్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం అన్ స్కిల్డ్ వర్కర్లకు ప్రతి నెలా రూ.5821 చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.3600 మాత్రమే ఇస్తున్నారు.
అలాగే కార్మికులు నెలలో ఒకటి రెండు రోజులు విధులకు హాజరు కాకపోతే ఆ రోజుల్లో కూడా హాజరైనట్టు అధికారులు హాజరుపట్టికలో నమోదు చేసుకొని డబ్బులను కాజేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ ప్రతి కార్మికుడికి 13.61 శాతం పీఎఫ్ డబ్బులు చెల్లిస్తే, కార్మికుడు 12 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా ఈఎస్‌ఐకి 4.75 శాతం కాంట్రాక్టర్ చెల్లిస్తే కార్మికుడు 1.75 శాతం డబ్బులు చెల్లించాలి. కానీ కాంట్రాక్టర్ ఈ మొత్తాన్ని జమ చేయడం లేదు. రెండేళ్లుగా పని చేస్తున్న అన్‌స్కిల్డ్ వర్కర్లను స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలని, కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని, ప్రతి కార్మికుడికి నెలలో నాలుగు సెలవులు ఇవ్వాలని, ప్రతి ఏడాది రెండు జతల దుస్తులు, చెప్పులు ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు.
Advertisement
Advertisement