ఆర్‌టీసీ కార్మికుల్లో చిరునవ్వులు నింపుతాం
ఆర్‌టీసీ ఈయూ నేతలకు వైఎస్ జగన్ హామీ
సాక్షి, హైదరాబాద్: ఆర్‌టీసీ కార్మికుల ముఖాల్లో చిరునవ్వు నింపే విధంగా అన్ని రకాలుగా సహకారం అందిస్తానని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆర్‌టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) సీమాంధ్ర విభాగం ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో ఉన్న ఆర్‌టీసీ రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా నష్టాల్లో మునిగిపోయే ప్రమాదం ఉందని ఈయూ నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈయూ అధ్యక్షుడు సి.హెచ్.చంద్రశేఖరరెడ్డి నేతృత్వంలో రాజేంద్రప్రసాద్, దామోదరరావు, సుబ్రమణ్యంరాజు, ఎస్.ఎస్.రావు తదితరులతో కూడిన ప్రతినిధి బృందం ఆదివారం జగన్‌ను ఆయన నివాసంలో కలిసింది.
అనంతరం ఈయూ నేతలు విలేకరులతో మాట్లాడారు. విభజన తర్వాత ఆర్‌టీసీని ఆదుకొని కార్మికులకు న్యాయం చేస్తామని, అందరం కలిసి కార్మికుల ముఖాల్లో చిరునవ్వులు నింపుదామని జగన్ హామీ ఇచ్చారని వెల్లడించారు. ఆర్‌టీసీ నష్టాలను భరించాలని, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ల పట్ల కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటయిన వెంటనే.. ఆర్‌టీసీ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారు కోరుకున్న విధంగా సహకారం అందించడానికి సిద్ధమని జగన్ హామీ ఇచ్చినట్లు చెప్పారు.