
పొదుపు బాటలో ఆర్టీసీ
సాక్షి, అనంతపురం:
ఆర్టీసీకి అవసరమైన డీజిల్‌ను నేరుగా చమురు సంస్థల నుంచే కొనుగోలు చేసేందుకు చర్యలు ప్రారంభించడంతో అనంతపురం రీజియన్‌కు నెలకు సుమారు రూ.16.20 లక్షల మేర ఆదా కానుంది. జిల్లాలోని 12 డిపోల పరిధిలోని 724 బస్సులు రోజుకు 3 లక్షల కిలోమీటర్ల మేరకు తిరుగుతుండగా, సుమారు 65 వేల లీటర్ల డీజిల్ వ్యయమవుతోంది. గతంలో రూ.51.55తో ఆర్టీసీ చమురు సంస్థల నుంచి డీజిల్ కొనుగోలు చేసేది. ఆర్టీసీ సంస్థకు రాయితీపై డీజిల్ అందించరాదని 2013 జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో సంస్థ ఒక్కో లీటరుపై రూ.11.87 అదనంగా చెల్లించాల్సి వచ్చింది. బయటి బంకుల్లో డీజిల్ కొనుగోలు చేయడం ద్వారా కొంత వరకైనా ఈ భారాన్ని తగ్గించుకోవచ్చని భావించిన ఆర్టీసీ అధికారులు ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థలపై నియంత్రణ వదులుకోవడం.. ఎక్కువ మోతాదులో డీజిల్ కొనుగోలు చేసే సంస్థకు తక్కువ ధరకే అందించే అవకాశం ఉందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చమురు సంస్థలతోనే కొనుగోలు చేయాలని ఆర్టీసీకి సూచించింది. ఈ నిర్ణయంతో బయటి మార్కెట్‌లో లీటరుపై చెల్లించే ధరకన్నా రూ.0.90 పైసలు తక్కువకే లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో లీటరు డీజిల్ ధర రూ.64లు ఉండగా, ఆర్టీసీకి లీటరు రూ.63.10 లకే లభించనుంది . దీంతో జిల్లాలో రోజుకు 65 వేల లీటర్ల డీజిల్ అవసరం అవుతుండగా రోజుకు రూ.58,500 ఆదా అవుతుంది.
కమీషన్లకు చెక్
అధిక మోతాదులో డీజిల్ కొనుగోలు చేసే సమయంలో లీటరుపై 50 పైసల మేర కమీషన్ ఇచ్చేలా సంస్థకు చెందిన కొందరు అధికారులు బంకుల నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంటే.. రోజుకు రూ.32,500 మేరకు అధికారులు కమీషన్ల రూపంలో నొక్కేస్తున్నట్లు సమాచారం. ఎలాగూ అధికారులకు మామూళ్లు ముట్టజెబుతున్నామన్న ధీమాతో బంకుల నిర్వాహకులు ట్యాంకర్లను నేరుగా ఆర్టీసీ డిపోలకే పంపేవారు. రాయితీ తొలగింపు ఆర్టీసీకి భారంగా మారగా అటు వ్యాపారులు, ఇటు సంస్థ అధికారులకు మాత్రం కాసుల వర్షం కురిపించింది. అయితే , ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం అలాంటి ఆర్టీసీ అధికారులకు మింగుడుపడడం లేదని తెలుస్తోంది.ఇక నుంచి నేరుగా చమురు సంస్థల నుంచే డీజిల్ కొనుగోలు చేయాలని ఉత్తర్వులు రావడంతో, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు.