= రోడ్డెక్కిన బస్సులు
= వివిధ కారణాలతో 90 నిలిపివేత
= రెండు రోజుల్లో సాధారణ స్థితి
= ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
సాక్షి, విశాఖపట్నం : సరిగ్గా రెండు నెలల తర్వాత ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ దూకుడుకు కొంత చెక్ పడినట్టే. దసరా పండుగకు వెళ్లేవారంతా కాంప్లెక్స్‌ల్లో పిల్లాపాపలతో క్యూ కట్టారు. సమైక్యాంధ్ర సమ్మె నేపథ్యంలో విశాఖ రీజియన్ పరిధిలో సుమారు 1060 బస్సులు రెండు నెలలుగా డిపోలకే పరిమితమయ్యాయి. కాంట్రాక్ట్ సిబ్బందితో బస్సులు నడుపుదామని భావించినా ఉద్యమకారులు అంగీకరించకపోవడంతో అధికారులు వెనక్కు తగ్గారు. ఫలితంగా ఆర్టీసీ సుమారు రూ.48 కోట్ల ఆదాయం కోల్పోయింది. సీఎం, రవాణాశాఖ మంత్రితో ఆర్టీసీ కార్మిక నాయకులు, అధికారులు శుక్రవారం జరిపిన చర్చలు ఫలించడంతో శనివారం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి.
తొలి సర్వీసు 4.30కే : అర్ధరాత్రే బస్సుల్ని సిద్ధం చేసిన అధికారులు శనివారం ఉదయం 4.30 గంటలకే వాహనాల్ని రోడ్డుమీదకు పంపించేశారు. ఇతర ప్రాంతాల నుంచి 5 గంటల సమయంలో బస్సులు రయ్ మంటూ వచ్చేశాయి. అయితే రెండు నెలల పాటు బస్సులు కదలకపోవడంతో మరమ్మతులు, సాంకేతిక సమస్యలు, సెల్ఫ్ ఆగిపోవడం వంటి ఇబ్బందుల కారణంగా సుమారు 90 బస్సులు ముందుకు కదల్లేకపోయాయి.
దీంతో స్టాండ్‌బై బసుల్ని (అత్యవసర సర్వీసులు) వాడుకున్నారు. అవి తప్పా మిగిలిన బస్సులన్నీ రోడ్లపై పరుగులు తీశాయి. ప్రయాణికుల్ని మోసుకుంటూ వెళ్లిపోయాయి. విశాఖ నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ బస్సుల్ని పంపించారు. కొంతమంది సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో ఇబ్బంది ఎదురైనా అధికారులు క్రమంగా పునరుద్ధరించారు. రెండు రోజుల్లో పరిస్థితి సాధారణ స్థితికే వచ్చేస్తాయని ఆర్టీసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు స్పష్టం చేశారు.
స్పందన బావుంది
బస్సులు యథావిధిగా నడపడంతో జనం నుంచి స్పందన బాగానే ఉంది. సాధారణ స్థితిలో ఉన్నట్టే బస్సుల్ని పంపించాం. ఇన్నాళ్లూ తాము చాలా ఇబ్బందులకు గురయ్యామని, ప్రైవేట్ ట్రావెల్స్ తమను దోచుకున్నారని ప్రయాణికులు మా వద్ద వాపోయారు. తొలిరోజు ఆపరేషన్ సక్సెస్. దసరా నేపథ్యంలో ప్రత్యేక సర్వీసుల గురించి ఆలోచిస్తున్నాం. సమ్మె కాలంలో సహకరించిన జనానికి, కార్మిక సంఘాలకు, సిబ్బందికి కృతజ్ఞతలు.
- వై. జగదీష్‌బాబు, రీజినల్ మేనేజర్