హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెతో 6 వేల బస్సు సర్వీసులకుగాను 600 సర్వీసులు నడుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు బుధవారం హైదరాబాద్లో వెల్లడించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం రైల్వేల సాయం కోరామని రావెల తెలిపారు. ప్రత్యేక రైళ్లు, సబర్బన్ రైళ్లు నడపాలని... అలాగే రైళ్లకు అదనపు బోగీలు వేయాలని రైల్వే ఉన్నతాధికారులను కోరినట్లు ఆయన చెప్పారు. ఎంసెట్, డీఎస్సీ పరీక్షలపై ఆర్టీసీ సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు.
గిరిజన ప్రాంతాల్లో విద్యార్థుల ఎంసెట్కు మినీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు. 3 రోజుల్లో జరిగే డీఎస్సీ పరీక్షకు కూడా రవాణ సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని సూచించినట్లు రావెల వివరించారు.