ప్రయాణికులకు ఆర్టీసీ షాక్!
ప్రయాణికులకు ఆర్టీసీ షాక్!
Published Wed, Sep 17 2014 1:25 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక చిక్కుల్లో ఉన్న ఆర్టీసీని గ ట్టెక్కించాలంటే టికెట్ చార్జీలను తక్షణమే పెంచక తప్పదని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గత రెండు రోజులుగా దీనిపై తర్జనభర్జనపడ్డ అధికారులు.. చివరకు 15 శాతం వరకు టికెట్ ధరలు పెంచాలనే నిర్ణయానికొచ్చారు. ఫలితంగా ఏడాదికి రూ.900 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని అంచనా వేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని నేడో రేపో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పించనున్నారు.
పెంపు ఇలా...
అధికారుల తాజా ప్రతిపాదన ప్రకారం... ప్రతి కిలోమీటరుకు పల్లెవెలుగు బస్సుపై 10 పైసలు, ఎక్స్‌ప్రెస్-12 పైసలు, డీలక్స్-14 పైసలు, సూపర్ లగ్జరీ-16 పైసలు, ఇంద్ర- 20 పైసలు, గరుడ-24 పైసలు చొప్పున పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఎన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత ఈ భారం ఉంటుందనేది స్పష్టం కావాల్సి ఉంది. ఈసారి పేదల బస్సు పల్లెవెలుగును కూడా వదిలిపెట్టకూడదని అధికారులు నిర్ణయించారు. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థకు రూ.902 కోట్ల నష్టం రాగా, ఈసారి అది రూ.వేయి కోట్లను దాటబోతోంది. ఇదే విషయాన్ని అధికారులు ముందుగానే ఇరు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. ఆ రూ.వెయ్యి కోట్ల నష్టం పూడ్చుకోవాలంటే కచ్చితంగా 15 శాతం మేర టికెట్ ధరలు సవరించాల్సిందేనని స్పష్టంచేశారు. చార్జీల పెంపునకు ఏపీ సర్కారు సానుకూల సంకేతాలివ్వగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. కానీ, ఆర్టీసీ మనుగడ కొనసాగాలంటే టికెట్ ధరల పెంపునకు కచ్చితంగా అంగీకరించాల్సిందేనని అధికారులు తమ ప్రతిపాదనలో పేర్కొనటం విశేషం.
ఏడాది గడవకుండానే...
గతేడాది నవంబర్‌లో నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 10 శాతం మేర టికెట్ ధరలు పెంచి ప్రజలపై రూ.600 కోట్ల వార్షిక భారం మోపిం ది. డీజిల్ ధరలు లీటరుకు ప్రతినెలా కనిష్టంగా 50 పైసల చొప్పున పెరుగుతుండటంతో సంవత్సరానికి రూ.400 కోట్లకు పైగా భారం పడుతోంది. దీంతో ఏడాది తిరగకుండానే చార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది.
Advertisement
Advertisement