'చక్ర'బంధం | APSRTC in deep Financial Crisis | Sakshi
Sakshi News home page

'చక్ర'బంధం

Published Tue, Sep 16 2014 1:47 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

APSRTC in deep Financial Crisis

అనేక కారణాలతో ఆగిపోతున్న ప్రగతిరథ చక్రాలు
 తీవ్ర సంక్షోభంలో ఆర్టీసీ... అంతులేని నష్టాలతో దైన్యస్థితి
  సర్కారు నిర్లక్ష్యం, యాజమాన్యం ఉదాసీనత, తుప్పుపట్టిన విధానాలతో కుదేలు
  చార్జీల పెంపే మందుగా భావిస్తున్న ప్రభుత్వాలు
  డొక్కు బస్సులతో మూలుగుతున్న ఆర్టీసీకి చేయూత కరువు, ముక్కుపిండి పన్ను వసూళ్లు
  పట్టని ‘ప్రైవేటు’ ఆగడాలు, నిర్వహణ లోపాలు
  గతేడాది ఇంధన వ్యయమే రూ. 2,368 కోట్లు, ఏటా రూ. 400 కోట్లు అధికం
  అప్పులు రూ. 4,730 కోట్లు, ఈ ఏడాదిలో మరో వెయ్యి కోట్లు అదనం 
  ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టని అధికారులు
 
 గౌరీభట్ల నరసింహమూర్తి, సాక్షి ప్రతినిధి
 ప్రగతి రథ చక్రాలుగా పేర్కొనే ఆర్టీసీ బస్సు ఇక నడవలేనంటూ మొరాయిస్తోంది. అంతులేని నష్టాలను మూటగట్టుకుంటూ అంపశయ్యపైకి చేరుకుంటోంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు ఈ దుస్థితికి కారణాలెన్నో..! చార్జీల పెంపు తప్ప మరే ప్రత్యామ్నాయమూ ఆలోచించని యాజమాన్యం, కాలం చెల్లిన నిర్వహణా విధానాలు, సర్కారు నిర్లక్ష్య వైఖరి వంటి అనేకానేక కారణాలతో ఆర్టీసీ నానాటికీ సంక్షోభంలోకి కూరుకుపోతోంది. సిబ్బందికి జీతాలివ్వలేక వారి పీఎఫ్ సొమ్మునూ వాడేసుకుంటున్న దైన్యం, పదవీ విరమణ చేసినవారికీ సొమ్ము చెల్లించలేని వైనం రవాణా సంస్థ దుస్థితికి తార్కాణం. చరిత్రలో ఎన్నడూ లేనంతగా నష్టాలు కొండలా పేరుకుపోవడంతో ప్రయాణికులపై మరింతగా చార్జీల భారాన్ని మోపకతప్పని పరిస్థితి నెలకొంది. మరి ఇందుకు కారణాలేంటి? కారకులెవరు? గట్టెక్కడానికి మార్గాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం... 
 
 వెయ్యి కోట్లు తన్నుకుపోతున్న ‘ప్రైవేటు’ 
 కొన్ని నెలల క్రితం లారీ డ్రైవర్లు సమ్మె చేసినప్పుడు ఒక్కసారిగా ఆర్టీసీ ఆదాయం పెరిగింది. అది ఎంతో తెలుసా?!.. రోజుకు రూ. కోటి. అంటే కేవలం లారీల్లో ప్రయాణికులు తరలుతున్నందున నిత్యం రూ. కోటి చొప్పున ఆదాయం చేజారుతోందన్న మాట! మరి అదే నియంత్రణ లేని ప్రైవేటు బస్సులతో ఎంత ఆదాయం కోల్పోతోంది? దీనిపై ఆర్టీసీ సొంతంగా చేసిన అధ్యయనం ప్రకారం.. ప్రైవేటు వాహనాలను నియంత్రించి, నిబంధనలను సరిగా అమలు చేస్తే సంస్థకు ఏటా అదనంగా సుమారు రూ. వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అంటే ఆర్టీసీలో నష్టాల మాటే ఉండదన్నమాట! తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతూ ఆర్టీసీ అంపశయ్యపైకి చేరినా రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సులను  ఎందుకు నియంత్రించలేకపోతున్నారనేది అందరి మదిలో మెదిలే ప్రశ్న. 
 
 ‘చమురు’ ఇలా వదులుతోంది
 గత ఆర్థిక సంవత్సరంలో డీజిల్ కోసం ఆర్టీసీ చేసిన వ్యయం అక్షరాలా రూ. 2368 కోట్లు. ఇది అంతకుముందు ఏడాది కంటే దాదాపు రూ. 400 కోట్లు అధికం. ప్రతినెలా డీజిల్‌పై అర్థ రూపాయి చొప్పున పెరుగుతూ రావడంతో ఈ అదనపు భారం పడింది. ఏటా పెరిగే ఆదాయం కంటే ఈ ఇంధన భారమే అధికంగా ఉంటోంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం లభించడం లేదు. తమిళనాడులో లీటర్ డీజిల్‌కు అక్కడి ఆర్టీసీ చేస్తున్న వ్యయం 45 రూపాయలే. మిగతా మొత్తాన్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఇక విమానాలకు వాడే ఇంధనంపై ప్రస్తుతం వ్యాట్ 4 శాతమే ఉండగా... ఆర్టీసీ వాడే డీజిల్‌పై మాత్రం 22 శాతం ఉంది. వ్యాట్ భారమే ఏటా రూ. 80 కోట్ల వరకు ఉంటోంది. దీన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటూ వచ్చింది. ఇక ఆర్టీసీ ఖర్చుల్లో డీజిల్ ఖాతా అతిపెద్దది. ఇందులో ఎంత పొదుపు చేస్తే.. నష్టాలు అంత తగ్గుతాయి. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి విరుద్ధం. గుజరాత్ ఆర్టీసీలో 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను తుక్కు కింద అమ్మేస్తున్నారు. కానీ మన ఆర్టీసీలో 12 లక్షల నుంచి 15 లక్షల కిలోమీటర్లు తిరిగేవరకు అవే బస్సులతో ఈడ్చుకొస్తున్నారు. దీంతో ఫిట్‌నెస్ సరిగా లేక అవి విపరీతంగా డీజిల్ తాగుతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి బస్సులు 8 వేల వరకు ఉంటాయని అంచనా. సాధారణంగా వంద లీటర్ల డీజిల్‌కు 600 కిలోమీటర్లు తిరగాల్సిన ఈ బస్సులు.. ఇప్పుడు అంతే దూరానికి మరో 15 లీటర్లను ఎక్కువగా తాగుతున్నాయి. దీంతో డీజిల్ ఖర్చు భారీగా పెరుగుతోంది. విడి భాగాలు కూడా తరచూ మార్చాల్సి రావడం మరో నష్టం. ఇంజిన్ ఆయిల్ లీకేజీ సమస్యలూ అధికమే. 
 
 నాణ్యత లేని పరికరాలు
 ఆర్టీసీ గ్యారేజీకి సరఫరా అవుతున్న పరికరాల్లో కొన్ని ఏమాత్రం నాణ్యత లేనివి ఉంటున్నాయి. బిగించిన కొద్ది రోజులకే ఆ పరికరాలు పాడైపోతుండటంతో నిర్వహణ వ్యయం పెరుగుతోంది. పైగా కొన్ని కంపెనీలు తమ కొత్త పరికరాలను ఆర్టీసీపైనే ప్రయోగిస్తూ నష్టాన్ని పెంచుతున్నాయి. మొత్తం ఖర్చులో పరికరాల వాటా 20 శాతం వరకు ఉంటుందని అంచనా. అంటే సంవత్సరానికి దాదాపు రూ. 50 కోట్లన్నమాట. 
 
 వాహన పన్ను తడిసి మోపెడు
 ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆటోలకు వాహన పన్ను(ఎంవీ ట్యాక్స్)ను రద్దు చేసింది. కానీ ఆర్టీసీ నుంచి మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తోంది. తాజా సంవత్సరానికి ఈ పన్ను రూపంలో సంస్థపై పడిన భారం రూ. 453 కోట్లు. ఇటీవల ఉద్యమ సమయంలో మాత్రం రెండు దఫాలుగా ఈ పన్ను నుంచి మనహాయింపు లభించింది. దీన్ని పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండు పెండింగులోనే ఉంది. కర్ణాటకలో ఆర్డినరీ బస్సుల ట్యాక్సును ప్రభుత్వమే భరిస్తోంది. గతంలో ప్రైవేటు వాహనాల తరహాలో ప్రతి మూడు నెలలకు ఒక్కో సీటుపై నిర్ధారిత మొత్తం పన్ను ఉండేది. సంస్కరణ చర్యల్లో భాగంగా ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా.. లాభాలపై నిర్ధారిత శాతాన్ని వాహన పన్నుగా వసూలు చేసే విధానాన్ని ప్రారంభించారు. ఆర్డినరీ బస్సుల రాబడిపై 15 శాతం, ఎక్స్‌ప్రెస్ ఆపై కేటగిరీ బస్సులపై 20 శాతం విధించి పెద్ద భారం మోపారు. రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక వాటిని 7, 12 శాతాలకు తగ్గించారు. దాన్ని కూడా రద్దు చేసే యోచనలో ఉండగానే ఆయన మృతిచెందారు. 
 
 సమన్వయ లోపంతో పేచీలు, సమ్మెలు
 ఆర్టీసీ అధికారులు-కార్మికుల మధ్య సఖ్యత లేక తరచూ చిన్న చిన్న సమ్మెలకు దారితీస్తోంది. డ్యూటీలు వేస్తున్న తీరు, ఓఆర్‌పై నిలదీయడం, బస్సుల కండిషన్ తదితర అంశాలపై రెండు వర్గాల మధ్య అగాథం పెరిగి వివాదాలు తలెత్తుతున్నాయి. దీంతో రీజియన్ల పరిధిలోనే ఎక్కడికక్కడ తాత్కాలిక సమ్మెలు జరుగుతున్నాయి. సంవత్సంలో ఇలాంటివి వంద వరకు ఉంటాయని అంచనా. దీంతో ఆర్టీసీ ఆదాయానికి గండిపడుతోంది. 
 
 సరుకు రవాణాపై దృష్టి పెడితే... 
 నిత్యం ఆర్టీసీ బస్సులు కొన్ని రకాల సరుకులను రవాణా చేస్తుంటాయి. వ్యాపారులు ప్రత్యేకంగా బుక్ చేసుకుని వాటిని తరలిస్తుంటారు. ఈ మొత్తం లావాదేవీలను ఓ ప్రైవేటు సంస్థ పర్యవేక్షిస్తోంది. ఈ రూపంలో ఆర్టీసీకి సంవత్సరానికి వచ్చే ఆదాయం రూ. 10 కోట్లు మాత్రమే. కానీ ప్రైవేటు సంస్థతో సంబంధం లేకుండా సొంతంగా ఆర్టీసీనే దీన్ని భారీ ఎత్తున నిర్వహిస్తే ఏటా రూ. 300 - 400 కోట్ల వరకు ఆదాయం పొందే వీలుంటుందని అంచనా. కార్మిక సంఘాలు చాలాకాలంగా ఇందుకు డిమాండ్ చేస్తున్నా యాజమాన్యం మాత్రం ఈ దిశగా అడుగులేయడం లేదు. రైల్వే శాఖ తన ఆదాయంలో మూడొంతులకుపైగా సరుకు రవాణా ద్వారానే పొందుతోంది. ఆర్టీసీ కూడా అదే బాట పడితే అద్భుతరీతిలో లాభాలు పొందవచ్చని నిపుణలు గతంలోనే తేల్చారు. ప్రస్తుతమున్న కాలం చెల్లిన బస్సులనే ఇందుకు వినియోగించుకోవచ్చునని వారు చెబుతున్నారు.
 
 ఆస్తులను సద్వినియోగం చేసుకుంటే...
 ఆర్టీసీకి ఉమ్మడి రాష్ర్టంలో రూ. 60 వేల కోట్ల ఆస్తులున్నాయి. ఇందులో భవనాల వాటా 20 శాతం. మిగతా ఖాళీ స్థలాల్లో వాణిజ్యపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తే అప్పనంగా ఆదాయం వచ్చిపడుతుంది. దీనిముందు అప్పులు బలాదూరే! కానీ ఈ దిశగా ఇప్పటి వరకు ఒక్క అడుగూ పడలేదు. గుజరాత్ ప్రభుత్వం బడ్జెట్‌లో దాదాపు రూ. 500 కోట్లను అక్కడి ఆర్టీసీకి ఏటా కేటాయిస్తోంది. గత రెండు బడ్జెట్లలో రూ. 200 కోట్లు చొప్పున ఇవ్వటం మినహా ఆ తరహా చేయూత మన ఆర్టీసీకి లేదు. ప్రభుత్వం గ్యారంటీగా ఉంటూ బ్యాంకుల నుంచి లోన్లు మాత్రం ఇప్పిస్తోంది. కానీ ఆ నిధులు చాలడం లేదు. 
  
 నడ్డి విరుస్తున్న వడ్డీ
 ప్రస్తుతం ఆర్టీసీ అప్పులు రూ. 4730 కోట్లకు చేరాయి. దీనిపై చెల్లిస్తున్న వడ్డీనే అక్షరాలా రోజుకి రూ. కోటిన్నర! అంటే సంస్థ ఆదాయమంతా వడ్డీలకే చాలనప్పుడు ఇక అసలు అప్పు కరిగేదెన్నడో..? ప్రస్తుతం ఆర్టీసీ పరిస్థితి మరింతగా దిగజారింది. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ మూటగట్టుకున్న నష్టాలు రూ. 902 కోట్లు కాగా.. ఈసారి తొలి నాలుగు నెలల నష్టాలే రూ. 450 కోట్లుగా ఉంది. దీన్ని ఇప్పట్లో చ క్కదిద్దే పరిస్థితి లేదని యాజమాన్యం చేతులెత్తేసింది. ఈ ఏడాది నష్టం వెయ్యి కోట్లు దాటుతుందని ముందస్తుగానే నివేదించి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆశ్రయించింది. 
 
 
 సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు ఆధ్వర్యంలోని ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్’ తాజా సంచికలో చెప్పిన వివరాలు(తొలి ఆరు నెలల కాలానికి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement