27 నుంచి ఆర్టీసీ సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సమ్మె అనివార్యంగా కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ విషయంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నందున ఈ నెల 27 నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ గుర్తింపు యూనియన్లు ప్రకటించాయి. సంక్రాంతికి ముందే సమ్మె చేయాలని నిర్ణయించినప్పటికీ.. పండుగకు ఊళ్లకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వాయిదా వేసుకున్నామని, అయితే 27 నుంచి మాత్రం సమ్మె తప్పదని గుర్తింపు సంఘాలైన ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) ప్రధాన కార్యదర్శి పద్మాకర్, తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు కార్మికులను సమాయత్తపరిచేందుకు సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు సవరించడంతోపాటు మధ్యంతర భృతి కూడా చెల్లించాలని చాలాకాలంగా ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పలుమార్లు యాజమాన్యంతో చర్చలు కూడా కొనసాగాయి. కానీ ఇప్పటివరకూ దీనిపై స్పష్టత రాలేదు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున ఇప్పట్లో వేతన సవరణ సాధ్యం కాదని, లాభాల బాట పట్టాక పరిశీలిస్తామంటూ ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తోందని యూనియన్లు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమ్మెకు దిగుతున్నట్టు గుర్తింపు సంఘాల నేతలు పేర్కొన్నారు.