కస్సు ‘బస్సు’
తాత్కాలిక సిబ్బందికి వరంలా మారిన ఆర్టీసీ సమ్మె
{పయాణికుల నుంచి ఇష్టానుసారం వసూలు
సంస్థకు వస్తున్నది నామమాత్రపు ఆదాయం
ఏడు రోజులవుతున్నా గాడిలో పడని టికెట్ రేట్లు
{పమాదాలు, అక్రమ వసూళ్లపై లోపించిన పర్యవేక్షణ
విశాఖపట్నం: పిల్లికి చెలగాటం..ఎలుకకు ప్రాణసంకటమన్నట్లుగా తయారైంది ఆర్టీసీ సమ్మె వల్ల ప్రయాణికుల పరిస్థితి. బస్కెక్కాలంటేనే జనం వెనుకడుగేస్తున్నారు. తాత్కాలిక సిబ్బంది ‘టికెట్ రేట్’కు అంతూపొంతూ లేకుండా పోతోంది. రోజుకు వెయ్యి రూపాయల వేతనం కోసం వచ్చిన వారు వేలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. ఎక్కువ చెల్లించలేక ప్రయాణికులడిగితే సిబ్బంది తిరగబడుతున్నారనే ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి. బస్సు దించేస్తున్న సంఘటనలూ ఉంటున్నాయి. నివారించాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. టిక్కెట్లు కూడా లేకపోవడంతో తనిఖీలు కూడా మానేసి కార్యాలయాలకు పరిమితమవున్నారు. ఫలితంగా అటు సంస్థకు,ఇటు ప్రయాణీకులకు ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
జిల్లాలో ఆర్టీసీకి 1016 బస్సులున్నాయి. అరకు, సింహాచలం వంటి ప్రాంతాలకు ప్రతి రోజూ వందలాది బస్సు సర్వీసులు తిరుగుతాయి. కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, నర్శీపట్నం, విజయనగరం వంటి నగరాలకు నాన్‌స్టాప్ సర్వీసులు నడుపుతున్నారు. దాదాపు 500 బస్సులు సిటీ సర్వీసులున్నాయి. దీంతో ఆదాయం కూడా అదే స్థాయిలో వస్తోంది. సాధారణ రోజుల్లో రూ.70 లక్షల రాబడి ఉంటే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంలో రోజుకి రూ.1.04 కోట్లు ఆదాయం వస్తోంది. సమ్మె ప్రారంభానికి ముందు రోజు వరకూ ఉన్న పరిస్థితి ఇది.
కానీ ఇప్పుడలా లేదు.
సమ్మె ఏడు రోజులుగా జరుగుతోంది. అధికారులు 150 అద్దె బస్సులను రంగంలోకి దించారు. అందుబాటులో ఉన్న టైనీ డైవర్లను వినియోగించారు. అవి ఏ మూలకు సరిపోకపోవడంతో ప్రైవేట్ బస్సులకు గేట్లు తెరిచారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా పని చేయడానికి వస్తే రోజుకి రూ.1000 చొప్పున చెల్లిస్తామన్నారు. దీంతో నిరుద్యోగులు క్యూకట్టారు. వెయ్యి రూపాయలకు ఇంత మంది వస్తున్నారేమిటని అధికారులే ఆశ్చర్యపోయారు. కానీ వారి ఆలోచన తర్వాత అర్ధమైంది. ప్రయాణీకుల అవసరాలను సొమ్ము చేసుకోవడం ప్రారంభించారు. ఆర్టీసీ డిపోల్లోని బంకుల్లోనే తమ బస్సులకు ఆయిల్ కొట్టించుకుని మరీ తీసుకువెళ్లిన బస్సుల్లో సాయంత్రానికి రెండు మూడు వేల రూపాయలకు మించి ఆదాయం చూపించడం లేదు. సమ్మె వల్ల ఆర్టీసీకి రోజుకి రూ.85లక్షల నష్టం వాటిల్లుతోందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో 60 శాతం బస్సులను నడుపుతున్నామంటున్నారు. అంటే కోటి రూపాయల ఆదాయం వచ్చే ఆర్టీసీ 40 శాతం బస్సులను నడపకపోవడం వల్ల ఆ నలభై శాతం మాత్రమే ఆదాయం కోల్పోవాలి. ఈ లెక్కన రూ.60లక్షల ఆదాయం సమకూరాలి. కానీ వస్తున్నది కేవలం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య మాత్రమే మిగతా రూ.40 లక్షలు ఏమవుతున్నట్టు.? ఈ ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు.
ఎక్కువ వసూలు చేస్తే చర్యలు
‘‘కార్మికుల సమ్మె వల్ల ప్రైవేటు బస్సులను తాత్కాలిక సిబ్బందిని తీసుకున్నాం. అయితే టిక్కెట్లు కొట్టే పరిస్థితి లేదు. దీంతో వారికి టిక్కెట్టు ధరల చార్టు ఇచ్చాం. దాని ప్రకారమే తీసుకోమని చెప్పాం. ఎక్కువ వసూలు చేసినట్టు తెలిస్తే విధుల నుంచి తప్పిస్తామని,తర్వాత ఎప్పుడూ అవకాశం ఇవ్వమని కూడా హెచ్చరించాం. అంతకు మించి తనిఖీలు నిర్వహించడానికి ప్రస్తుతం అధికారులెవరూ అందుబాటులో లేరు.
-వై.జగదీష్‌బాబు, ప్రాంతీయాధికారి, ఆర్టీసీ, విశాఖ