'రాత్రిలోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోండి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చరల్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న ఎంసెట్-2015కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్తో భేటీ అయ్యారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఎంసెట్ పరీక్ష నిర్వహణకు ఆర్టీసీ సమ్మెతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్, డీఎస్సీ పరీక్షలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. పరీక్షల్లో షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదన్నారు.
సుమారు 2.55 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్కు హాజరవుతున్నట్లు గంటా తెలిపారు. 13 జిల్లాల్లో ప్రయివేట్ బస్సులను ఎంసెట్, డీఎస్సీ పరీక్షలకు ఉపయోగించాలని ఆదేశించామని, దీనిపై ఆర్టీసీ ఎండీతో మాట్లాడినట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కార్మికులు పునరాలోచించాలని గంటా విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరారు. వీలైతే విద్యార్థులు గురువారం రాత్రిలోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 40 శాతం మాత్రమే ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయని, అన్ని ప్రయివేట్ స్కూల్ బస్సులను స్వాధీనం చేసుకుంటామని గంటా తెలిపారు.
ఇక ఉన్నత విద్యామండలిపై హైకోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. కాగా అపాయింటెడ్ డే నాటికి హైదరాబాద్లో ఉన్న ఉన్నత విద్యామండలి ...తెలంగాణా రాష్ట్రానికే చెందుతుందని హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.