ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు తొలిరోజే ఆటంకం | Interruption to ap eamcet web counselling | Sakshi
Sakshi News home page

ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు తొలిరోజే ఆటంకం

Published Tue, Jun 7 2016 4:41 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

Interruption to ap eamcet  web counselling

- సాంకేతిక సమస్యలతో పనిచేయని సర్వర్లు
- సాయంత్రానికి ప్రారంభమైన సర్టిఫికెట్ల పరిశీలన
 
 సాక్షి, హైదరాబాద్/విజయవాడ(గుణదల): ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు తొలిరోజే సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) ద్వారా ఆన్‌లైన్లో అప్‌లోడ్ కావాల్సిన సమాచారం.. సర్వర్లు పనిచేయక సాయంత్రం వరకు కౌన్సెలింగ్ ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. ఎట్టకేలకు సాయంత్రం 6గంటల తర్వాత సర్వర్లు పనిచేయడంతో కొన్ని చోట్ల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అనంతపురం జేఎన్‌టీయూఏ పరిధిలోని మూడు కేంద్రాల్లో మాత్రం మంగళవారానికి వాయిదా పడింది.

 ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగాలి. ఈ మేరకు విశాఖపట్నంలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కౌన్సెలింగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అయితే, ఎన్‌ఐసీ సర్వర్లు పనిచేయకపోవడంతో ధ్రువపత్రాల పరిశీలనను అధికారులు మధ్యాహ్నానికి వాయిదా వేశారు. చివరకు సాయంత్రం 6గంటల తర్వాత సర్వర్లు పనిచేయడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. గతంలోనూ ఇదే సమస్యరాగా అప్పట్లో కౌన్సెలింగ్ రెండురోజులు నిలిచింది. ఈసారీ అదే సమస్య తలెత్తడంతో కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాల్సి వస్తుందేమోనని అధికారులు భావించారు. చివరికి సర్వర్లు పనిచేయడంతో రాత్రివరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,821 మంది ధ్రువపత్రాలు పరిశీలించినట్లు కౌన్సెలింగ్ కమిటీ ప్రత్యేకాధికారి రఘునాథ్ వివరించారు. మంగళవారం నుంచి యథావిధిగా సర్టిఫికెట్ల పరిశీలన సాగుతుందని అధికారులు వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement