హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత తొలిసారి నిర్వహించిన ఎంసెట్ 2015 ఎంట్రన్స్ టెస్టుకు 95 శాతానికి పైగా విద్యార్ధులు హాజరయ్యారని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెతో ప్రతికూల వాతావరణం ఉన్నా.. అందరి సహకారంతో ఎంసెట్ విజయవంతమైందన్నారు. మే10న ఎంసెట్ కీ, మే 26న ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామని గంటా తెలిపారు. రేపటి నుంచి జరిగే డీఎస్సీకి కూడా అందరూ సహకరించాలన్నారు.
మూడు రోజుల పాటు జరిగే డీఎస్సీ పరీక్షలకు మూడు లక్షల తొంభై రెండ వేల, రెండొందల మంది హాజరు కానున్నట్లు గంటా తెలిపారు. ఈ పరీక్షలకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. జూన్ 1 వ తేదీలోపు డీఎస్సీ ఫలితాలు కూడా విడుదల చేస్తామన్నారు. ఉన్నత విద్యామండలిపై ఏం చేయాలన్నదానిపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.