
బస్సెక్కిన ఆర్టీసీ కార్మికులు
రైట్...రైట్
ఫిట్‌మెంట్ ప్రకటనతో కార్మికుల్లో సంబరాలు
వైఎస్ జగన్ మద్దతు ప్రభావం చూపిందన్న కార్మికులు
అనంతపురం రూరల్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తలవంచిన ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడానికి ముందుకు రావడంతో జిల్లాలోని 12 డిపోల్లో పండుగ వాతావరణం బుధవారం నెలకొంది. కార్మికులు డిపో ముందుకు వచ్చి మిఠాయిలు పంచుకున్నారు. బాణా సంచా పేల్చి, రంగులు చల్లుకుని తమ ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామనడంతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని కార్మికులు పేర్కొన్నారు. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వడం హర్షనీయమన్నారు.
విధుల్లోకి కార్మికులు
సమ్మె కారణంగా రీజియన్‌లోని 4,652 మంది విధులకు దూరంగా ఉన్న విషయం విధితమే. ఫిట్‌మెంట్ ప్రకటనతో కార్మికులు ఆగమేఘాలపై విధులకు హాజరయ్యారు. ఆర్టీసీ యాజమాన్యం ఆలస్యం చేయకుండా కార్మికులను రంగంలోకి దించింది. వారం రోజులుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ‘అనంత’ రీజియన్‌కు రూ.8 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఆర్టీసీ ఆర్‌ఎం జి.వెంకటేశ్వరరావు కింది స్థాయి అధికారులతో సమావేశమై బస్సులు తిరిగేలా చర్యలు తీసుకున్నారు.
రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామనడంతోనే..
వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పోరాటంతోనే ప్రభుత్వం మేలుకుంది.. కార్మికులకు ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది అని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి అన్నారు. ఫిట్‌మెంట్ ప్రకటన తర్వాత వారు ఆర్టీసీ కార్మికులతో కలసి సంబరాలు చేసుకున్నారు. వైఎస్ జగన్ ఫిట్‌మెంట్‌పై స్పష్టత రాకపోతే రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారని, అందుకు ప్రభుత్వం దిగి వచ్చిందని తెలిపారు.
కార్మికులకు న్యాయం జరిగినందుకు ఆనందంగా ఉందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకుందన్నారు. సీఎం చంద్రబాబు కార్మిక ద్రోహి అని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండ ఫలించిందని ఆర్టీసీ జేఏసీ నేతలు వీఎన్ రెడ్డి, సీఎన్ రెడ్డి, కొండయ్య, అవధాని శ్రీపాద అన్నారు. కార్మికుల పక్షాన నిలబడి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామనడంతో ప్రభుత్వం దిగివచ్చిందని తెలిపారు.
సంబరాల్లో ఆర్టీసీ జేఏసీ నేతలు అవధాని శ్రీపాద, జబ్బార్, ఆదాం, కల్లప్ప, వెంకటేశ్, రామాంజినేయులు, వైఎస్సార్ సీపీ నేతలు ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, మీసాల రంగన్న, కాంగ్రెస్ పార్టీ నేత దాదాగాంధీ, వామపక్ష నేతలు జాఫర్, రాజారెడ్డి, నాగేంద్ర, లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల మౌన ప్రదర్శన
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ జేఏసీ, కార్మికులు బుధవారం మౌన ప్రదర్శన నిర్వహించారు. కార్మికులు నల్లరిబ్బన్‌లను నోటికి కట్టుకుని ర్యాలీగా అనంతపురం బస్టాండ్ నుంచి శ్రీకంఠం సర్కిల్ మీదుగా సప్తగిరి సర్కిల్‌కు చేరుకున్నారు. అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. జిల్లాలోని మిగితా 11 డిపోల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం కళ్లు తెరవాలంటూ నినాదాలు చేశారు.
కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. వీరికి వైఎస్సార్ సీపీ, వామపక్ష పార్టీలు మద్దతు తెలిపారు. ఈ మౌన ప్రదర్శన ర్యాలీలో ఆర్టీసీ జేఏసీ నేతలు వీఎన్ రెడ్డి, సీఎన్ రెడ్డి, కొండయ్య, నాగిరెడ్డి, ఆదాం, జబ్బార్, రామిరెడ్డి, గోపాల్, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
కిక్కిరిసిన ఆర్టీసీ బస్టాండ్
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించడంతో ప్రయాణికులకు పెద్ద ఊరట లభించింది. బుధవారం సాయంత్రం నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బస్టాండ్‌కు చేరుకున్నారు. దీంతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. అసలే వేసవి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చారు.
ఆర్టీసీ యాజమాన్యం రాత్రి సర్వీసులను పునరుద్ధరించింది. ఆర్‌ఎం జీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గురువారం నుంచి పూర్తిస్థాయిలో బస్సులు తిప్పుతామన్నారు. గతంలో అన్ని రూట్లకు ఏవిధంగా సర్వీసులు వెళ్లాయో అదే స్థాయిలో బస్సులు పంపుతామన్నారు.