
కాలం చెల్లిన శిథిల భవనం ముందు భాగం కూలిన దృశ్యం
సాక్షి,కావలి(నెల్లూరు) : పట్టణంలో సుమారు 90 ఏళ్ల నాటి కాలం చెల్లిన శిథిల భవనం శనివారం రాత్రి కుప్పకూలిపోయింది. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శిథిల భవనం కూలిన వేళ రాత్రి కావడంతో పెను ప్రమాదం తప్పింది. పగలు కూలిపోయి ఉంటే పరిస్థితి ఊహకే అందడం లేదు. దేశానికి స్వాతంత్రం రాక ముందే నిర్మించి ఈ భవనం శిథిలమైపోయింది. ఈ భవనంలో పండ్లు, పూలు అమ్మకాలు చేసే వ్యాపారులు ఉంటారు. నిత్యం ఈ భవనం వద్ద కొనుగోలుదారులు కిక్కిరిసి ఉంటారు. ట్రంక్‌రోడ్డులోని నిత్యం జనాలతో అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య కూడలి ప్రాంతంలోనే ఈ శిధిల భవనం ఉండడం గమనార్హం. శిథిలమైన ఈ భవనం ఏ క్షణమైనా కూలిపోవచ్చని మునిసిపాలిటీ అధికారులు 2013లోనే గుర్తించారు. అయితే 2015లో మునిసిపాలిటీ అధికారులు ఈ కాలం చెల్లిన భవన యజమాని నల్లూరి రమేష్‌కు నోటీసులు జారీ చేసి, కూల్చేయాలని తెలియజేశారు. అయితే భవన యజమాని ఈ భవనాన్ని పండ్లు, కూరగాయలు అమ్మకాలు చేసే వారికి అద్దెకు ఇచ్చాడు. కేవలం అద్దెలకు కక్కుర్తి పడిన భవన యజమాని నల్లూరి రమేష్‌తో మునిసిపాలిటీ అధికారులు అమ్యామ్యాలతో చేతులు తడుపుకుని, ఇక ఈ భవనం వైపు కన్నెత్తి చూడడం మానుకొన్నారు.
ఇలా ఆరేళ్లుగా మునిసిపాలిటీ ఈ కాలం చెల్లిన శిథిల భవనం సంగతిని పట్టించుకోకపోవడంతో, భవన యజమాని నల్లూరి రమేష్ అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య కూడలిలో ఈ భవనాన్ని అద్దెకు ఇచ్చి సంపాదించుకుంటున్నాడు. ఈ క్రమంలో భవనం కుప్ప కూలిపోయింది. శిథిలమైన భవనం కూలిపోగా, మిగిలిన భవనంతోనే పండ్లు అమ్మకాలు చేసే వారితో వ్యాపారాలు చేయిస్తూ అద్దె రాబడిని శిథిల భవన యజమాని కొనసాగిస్తున్నాడు. రద్దీగా ఉన్న వాణిజ్య ప్రదేశంలో శిథిలమైపోయిన కాలం చెల్లిన భవనం కూలిపోతే వెంటనే రంగంలోకి దిగి చర్యలు తీసుకోవాల్సిన మునిసిపాలిటీ, ఆ దిశగా అడుగులు వేయడానికి కూడా ఇష్టపడలేదు. కేవలం భవన యజమాని విదిల్చే కాసులకు కక్కుర్తిపడి మునిసిపాలిటీ ప్రజల ప్రాణాలకు ముప్పుతో ముడిపడి ఉన్న కాలం చెల్లిన భవనాన్ని తొలిగించేందుకు చర్యలు తీసుకోవలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment