‘మందబుద్ధి’ వికలాంగుడికి పింఛన్ నిలిపివేసిన వైనం
ఆధార్ లేదంటూ మెలిక
కాస్తయినా కదలలేని కుమారుడిని రెండు చేతులు కట్టి
కార్పొరేషన్‌కు తీసుకువచ్చిన ముదుసలి
అదేమి చిత్రమో.. అన్నీ ఉన్న వారు కాస్త ‘సిఫార్సు’ను వెంటపెట్టుకుని, కొంచెం కమీషన్‌ను ముట్టజెప్పేసి ప్రభుత్వ కార్యాలయాల్లో చకచకా పనులు చేసేసుకుంటారు. పాపం.. అధికారులకు కూడా అప్పుడు ‘రూల్స్’ అడ్డు రావు. మన ప్రజాప్రతినిధుల సంగతి సరేసరి! ఇక్కడ వారి కోసం ఎంత ప్రస్తావించకపోతే అంత మంచిది. మన ‘రూల్స్ బాబు’లకు జాలి, కరుణ, దయార్ద్రహృదయం వంటి పదాలకు అర్థాలే తెలియవేమో! వాస్తవ పరిస్థితి కళ్లెదుటే కనిపిస్తున్నా.. వారి కంటి వెంట కన్నీటి చార అయినా రాదేమో! అందుకు ఈ ఉదంతమే ఉదాహరణ. ఆ ముదుసలి ఆక్రందన ఎలానూ వినలేరు. కనీసం.. ఆ మందబుద్ధి గల అభాగ్యుడిని చూసైనా వారి మనసు చలించలేదు. భగవంతుడు ఆ దీనుల ఇంటి దీపాన్ని ఆపేసి ఎలానూ ‘ఆసరా’ లేకుండా చేశాడు. మరి మన అధికారులో.. ఆ కుటుంబానికి ఉన్న కాస్త ‘భరోసా’ను నిలిపివేసి ఏడి‘పింఛే’స్తున్నారు! ‘మందబుద్ధి’ ఎవరిదనుకోవాలి? ఆ అభాగ్యుడిదా.. లేక మన వ్యవస్థదా?
విజయనగరం మున్సిపాలిటీ : ఈ పక్క చిత్రంలో విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ ముందు రెండు చేతులు కట్టి ఉన్న వ్యక్తి పేరు పెంటపాటి వెంకట సునీల్. తండ్రి ఆరేళ్ల క్రితం మరణించారు. తల్లి సుమారు 60 ఏళ్ల ముదుసలి. ఒక్కగానొక్క కొడుకు. పట్టణంలోని తూర్పుబలిజివీధిలో నివసిస్తున్నారు. సునీల్ జన్మతః మందబుద్ధి వికలాంగుడు. వయస్సు మూడు పదులు దాటినా కనీస లోకజ్ఞానం లేదు. ఇటువంటి వారికి ప్రభుత్వం అందించే రూ.1500 పింఛన్‌ను ఆధార్ కార్డు లేదంటూ నవంబర్ నుంచి మన అధికారులు నిలిపివేశారు. దీంతో తల్లి సావిత్రి కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ పింఛను పునరుద్ధరించాలని వేడుకుంటోంది. అయినా పట్టించుకునే వారు లేకపోవడంతో గురువారం కుమారుడితో కలసి కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి కమిషనర్ జి.నాగరాజుకు సమస్యను వివరించింది.
పూర్తిగా మందబుద్ధి గల వాడు కావడంతో ఆధార్ నమోదు కాలేదని వివరించింది. గతంలో రాజీవ్ స్టేడియంలో నిర్వహించిన ఆధార్‌నమోదు కార్యక్రమానికి తీసుకువెళ్లామని, అక్కడ తన కుమారుడు ఇబ్బంది పెట్టడంతో అధికారులు సైతం సహకరించలేదని వాపోయింది. సమస్యను పట్టించుకుని పింఛను పునరుద్ధరించేలా చూడాలని కోరింది. అయితే కార్యాలయం నుంచి కలెక్టర్ సమావేశానికి వెళ్లే హడావుడిలో ఉన్న కమిషనర్.. ఆ వృద్ధురాలి గోడును సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో ఆమె కార్యాలయం ఆవరణలో ఉన్న వారిని బతిమలాడినా ప్రయోజనం లేకపోవడంతో ఇంటి ముఖం పట్టింది.
ఆ పింఛనే లేకుంటే ఎలా బతికేది..?
ప్రస్తుతం ఇంట్లో మా ఇద్దరమే ఉంటున్నాం. నాకు 60 ఏళ్ల వయస్సు. భర్త కూడా చనిపోయాడు. కానీ నాకు వృద్ధాప్య పింఛను గానీ, వితంతు పింఛను గానీ రావడం లేదు. కొడుడు వికలాంగుడు. అతనికి వచ్చిన పింఛన్ సైతం గత నవంబర్ నుంచి నిలిపివేశారు. ఇంట్లో చిన్నగదిపై వచ్చే రూ.వెయ్యి ఆదాయంతో జీవనం సాగించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు.
- సావిత్రి (వికలాంగుడు సునీల్ తల్లి)
రూల్స్ బాబులు.. మానవత్వమే మరుస్తారు!
Published Fri, Dec 18 2015 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM
Advertisement
Advertisement