పండుటాకుల పాట్లు | A.P Govt ensures pension and ration only for TDP members | Sakshi
Sakshi News home page

పండుటాకుల పాట్లు

Published Tue, Nov 25 2014 1:38 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

పండుటాకుల పాట్లు - Sakshi

పండుటాకుల పాట్లు

 విజయనగరం కంటోన్మెంట్:  సవరాల పరమేశు. బాడంగి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వృద్ధుడు సవరాల పరమేశు వయస్సు 70 ఏళ్లు. ఇతని కుమారులు, కోడళ్లు వేరు కాపురముంటున్నారు. వారిదీ కూలీనాలీ జీవనమే. ఈ వృద్ధుడికి ప్రస్తుతం  ఏ ఆధారమూ లేదు. సెంటు భూమి కూడా లేని ఇతనికి ఐదెకరాల పొలం ఉండని చెప్పడంతో హతాశయుడయ్యాడు. పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. నా పింఛను నాకు ఇవ్వండి బాబూ! లేకపోతే  మీరు చెప్పినట్టుగా ఐదెకరాల పొలం అయినా  నాకు ఇచ్చేయండని బతిమాలుతున్నాడు.  పై చిత్రంలోని డెంకాడ గ్రామానికి చెందిన మహిళలు దాదాపు పాతికేళ్లక్రితం భర్తలను పోగొట్టుకున్న వారే! భర్త పోయి పిల్లలకు పెళ్లిళ్లయి వెళ్లిపోయాక వీరు ఏ ఆధారం లేకుండా విధివంచితులుగా బతుకీడుస్తున్నారు. కానీ వీరికి కూడా అధికారులు వయసు చాలలేదని, భూములున్నాయనీ పింఛన్లు నిలిపేశారు. దీంతో  వితంతువులుగా  బతుకీడుస్తున్న రొంగలి గంగమ్మ, నుర్జోగి బంగారమ్మ, నౌడు నాగులమ్మ, రొంగలి పెంటమ్మ తదితరులు బళ్లు కట్టించుకుని వచ్చి కలెక్టర్‌ను కలిశారు. తమ పింఛన్లు ఎందుకు నిలిపేశారంటూ వాపోయారు. సర్వే చేసి పింఛన్లు ఇస్తామని కలెక్టర్ ఎంఎం నాయక్ చెప్పడంతో మీ దయ నాయనా! అంటే తిరుగుముఖం పట్టారు.
 
 అర్థం లేని నిబంధనలతో జిల్లాలోని పండుటాకులను ఉసురు పెడుతూ వారిని కలెక్టరేట్‌కు తిప్పిస్తున్నారు. పింఛను ఎందుకు నిలిపివేశారో తెలియని వారు కొందరైతే ,నీకు వయసు లేదు, నీకు ఐదెకరాల పొలం ఉంది, నీవు చనిపోయావు వంటి కారణాలతో పింఛన్లు నిలిపివేశారని మరి కొందరు గగ్గోలు పెడుతున్నారు.  జిల్లాలోని 34 మండలాల్లో  ఇటీవల నిలిపేసిన పింఛన్లపై జిల్లా ఉన్నతాధికారులకు నివే దించుకునేందుకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు.  జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఆధార్, రేషన్ కార్డులతో పింఛన్లు అనుసంధానం చేసినపుడు దాదాపు 62వేల పింఛన్లు తొలగించారు. వీటిని ఇప్పుడు సవరణ చేసి, పరిశీలన చేసి అందిస్తామని అధికారులు చెబుతున్నారు. తమకు పింఛన్లు రాలేదని పండు ముసలి కన్నీరుమున్నీరవుతుంటే అయ్యో! అలాగా! పింఛను పునరుద్ధరిస్తామం టూ అధికారులు మొసలి కన్నీరు పెడుతున్నారు.
 
 వైఎస్సార్‌సీపీ అయితే పింఛన్లు తీసేయండి!
 మెరకముడిదాం మండలం ఉత్తరావిల్లి గ్రామానికి చెందిన 223 మంది పింఛన్లు తొలగించారు. ఈ గ్రామంలో 830 మంది పింఛనుదారులుండగా ఇందులో 223 మంది పింఛన్లు తొలగించడంతో వారంతా కలెక్టరేట్‌కు వచ్చారు. గతంలో పరిశీలన చేసి ఈ 223 మందిలో ఆరుగురివి మాత్రమే పునరుద్ధరించారు. మిగతా వారికి పునరుద్ధరించలేదు.  గుర్ల మండలం చింతపల్లి పేటలో అర్హులైన వికలాంగులకు కూడా పింఛన్లు నిలిపివేశారు. ఇదే గ్రామంలో 30 మంది వితంతువులకు కూడా పింఛన్లు ఆపేశారు. దీంతో ఆయా వర్గాలన్నీ లబోదిబోమంటున్నాయి.
 
 హెచ్‌ఐవీ పేషెంట్లవీ..
 జిల్లాలో పింఛన్లను తొలగించే ప్రక్రియ ఎంత నిర్దయగా సాగుతోందంటే ఉత్తరావిల్లి గ్రామంలో నలుగురు హెచ్‌ఐవీ పేషెంట్లకు కూడా నిలిపివేశారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ గ్రామంలో కూడా వైఎస్సార్ సీపీకి చెందిన  21 మంది అర్హులకు  జన్మభూమి గ్రామ సభలో పెన్షన్లు ఇచ్చి మరుసటి నెలలో వారికి నిలిపివేసి అధికార పార్టీకి ఇచ్చారని వాపోతున్నారు. అలాగే అభయ హస్తం పింఛన్లు కూడా నిలిపేశారంటున్నారు.  
 
 వావిలపాడులో 31 మంది అర్హులకు తొలగింపు
 వైఎస్సార్ సీపీకి చెందిన వారనే కారణంగా వేపాడ మండలం వావిలపాడు గ్రామంలో 31 మంది అర్హుల పింఛన్లు నిలిపివేశారని గ్రామ సర్పంచ్ బీల రాజేశ్వరి వాపోయారు. అర్హులైన పండుటాకులను, వితంతువులను తీసుకుని కలెక్టరేట్‌కు  ఆమె వచ్చారు. తమ పింఛన్లు తొలగించారంటూ వారంతా కలెక్టరేట్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
 
 వినతిపత్రం అందజేసిన పెనుమత్స
 కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు గంట్యాడ మండలంలో పింఛన్లను అక్రమంగా తొలగించారని  జాయింట్‌కలెక్టర్ బి రామారావుకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement