డెంకాడ: పింఛన్ కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. గెడ్డలో గల్లంతై విగతజీవిగా మారింది. పెదతాడివాడ పంచాయతీ పరిధి ఊడుకులపేట మదుము వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం
విజయనగరం మున్సిపాలిటీ పరిధి జమ్ము సమీపంలోని సీఆర్ నగర్(రాళ్లగెడ్డ) కాలనీకి చెందిన తనుకు గంగ(70) పింఛన్ కోసమని అదే మున్సిపాలిటీ పరిధి మంగళవీధికి శుక్రవారం వెళ్లింది. సాయంత్రమైనా ఆమె ఇంటికి తిరిగి చేరలేదు. వర్షం ఎక్కువగా కురవటంతో ఎక్కడైనా ఉండి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. రాత్రయినా ఇంటికి చేరకపోవడంతో వారు ఆందోళనకు లోనై, చుట్టుపక్కల వారికి విషయం తెలిపారు. పింఛన్ తీసుకుని వస్తుండగా రోడ్డుపై తాము గంగను చూశామని కొంతమంది వారికి తెలియజేశారు. దీంతో అంతా చుట్టుపక్కల వెతకసాగారు. వీరి ఇంటికి రావాలంటే మధ్యలో గెడ్డను దాటాలి. ఓవైపు జోరున వర్షం కురవడంతో అనుమానం వచ్చి గెడ్డలో వెతికారు. చివరకు డెంకాడ మండలంలోని ఊడుకులపేట గెడ్డ వద్ద మదుములో మృతదేహం కాలుభాగం బయటకు కనిపించాయి. వృద్ధురాలు గంగకు ఒకటి ‘బోధకాలు’ కావడంతో దాని ఆధారంగా ఆ మృతదేహం ఆమెదేనని గుర్తించి భోరుమన్నారు. పోలీసులు వచ్చిన తర్వాత మృతదేహాన్ని బయటకు తీశారు. డెంకాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కష్టాలమయంగా...
గంగ జీవితమే ఓ విషాదగాథ అని స్థానికులు చెబుతున్నారు. చాలా కాలం క్రితం ఆమె భర్త మరణించాడు. వీరికి ఒక్కగానొక్క కుమార్తె చంటి ఉంది. ఈమెకు పెళ్లి చేసింది. కుమార్తె గర్భిణిగా ఉన్నప్పుడే అల్లుడు వదిలిపోయాడు. అప్పటి నుంచి కూతురు, మనమరాలికి గంగే ఆసరాగా ఉంటోంది. వచ్చిన పింఛన్ డబ్బులు, రెక్కల కష్టం మీద కాలం వెళ్లదీస్తున్నారు. పింఛన్ తీసుకుని వస్తానని వెళ్లిన ఆమె.. ఇలా మృత్యువాత పడటం అక్కడి వారిని కలచివేసింది.
మింగేస్తున్న గెడ్డ...
ప్రస్తుతం జమ్ము ప్రాంతంలోని సీఆర్ నగర్‌లో ఉంటున్న కాలనీవాసులు ఇంతకు ముందు విజయనగరంలోని మంగళవీధి సమీపంలో ఉండే వారు. అయితే వారిని అక్కడ ఖాళీ చేయించి, సీఆర్ నగర్‌లో స్థలాలు ఇచ్చారు. కాలనీకి వెళ్లాలంటే రెండు వైపులా గెడ్డలు దాటాలి. వర్షాల సమయంలో గెడ్డల్లో ఎక్కువ నీరు ప్రవహిస్తుంటుంది. ఆ సమయంలో ఇలాంటి ప్రమాదాలే జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. గెడ్డలపై చిన్నపాటి వంతెనలు నిర్మించాలని కోరుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
గంగను మింగేసింది..!
Published Sat, Jun 6 2015 11:46 PM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM
Advertisement