పొగ తాగేస్తున్నారు..
► నిబంధనలు ఉల్లంఘిస్తున్న ధూమపానప్రియులు
► పట్టించుకోని అధికారులు
విజయనగరం ఫోర్ట్: బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగరాదనే నిబంధన ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ధూమపానప్రియులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. ప్రస్తుతం యువత ఎక్కువగా ధూమపానం వైపు మొగ్గు కనబరుస్తున్నారు. కళాశాల స్థాయి విద్యార్థులు కూడా ధూమపానానికి అలవాటు పడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నిబంధనల ప్రకారం పాఠశాల, బస్టాండ్, రైల్వేస్టేషన్, ఆలయాలు, ఆస్పత్రులుండే ప్రాంతాల్లో పొగ తాగరాదు. కాని ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. ముఖ్యంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో దర్జాగా పొగరాయళ్లు తమ పని కానిచ్చేస్తున్నారు. ఇటువంటి వారిపై ఎవ్వరూ చర్యలు తీసుకోకపోవడంతో మరింతగా రెచ్చిపోతున్నారు.
నిబంధనలు..
సెక్షన్–4 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో పొగత్రాగరాదు. నిబంధనను అతిక్రమించే వ్యక్తులకు రూ.200 ఫైన్ విధిస్తారు. సెక్షన్–6(ఎ) ప్రకారం విద్యాలయానికి 100 గజాల దూరంలో పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులు విక్రయించడం నేరం. ఈ నిబంధనను అతిక్రమిస్తే రూ. 200 అపరాధ రుసుం విధిస్తారు. అలాగే సెక్షన్–6(బి) ప్రకారం 18 ఏళ్ల లోపు వారికి పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదు. నిబంధన అతిక్రమిస్తే రూ.200 అపరాధ రుసుం విధిస్తారు.
అనర్థాలు ..
బహిరంగ ప్రదేశాల్లో పొగతాడం వల్ల పొగ తాగే వారికన్నా పక్కనున్న వారికి ఎక్కువ నష్టం జరుగుతుంది. క్యాన్సర్, బ్రాంకలైటీస్, శ్వాసకోస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
చర్యలు శూన్యం
బహిరంగ ప్రదేశాల్లో పొగతాగే వారిపై చర్యలు తీసుకోవాలి. కాని జిల్లా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి అపరాధ రుసుం విధించడానికి అవసరమయ్యే చలానా పుస్తకాలు రెండేళ్ల కిందట జిల్లాకు మంజూరయ్యాయి. అయితే ఆ పుస్తకాలు ఎక్కడున్నాయో అధికారులకు కూడా తెలియదంటే ఆశ్చర్యపడనక్కర్లేదు.