తాత సంరక్షణలో బాలుడు సాయి దుర్గారావు...
విజయనగరం, నెల్లిమర్ల రూరల్: మండలంలో సతివాడ గ్రామానికి చెందిన వేణుం సాయి దుర్గారావు అనే బాలుడిది వింత పరిస్థితి. చిన్నప్పటి నుంచి రెండు కాళ్లు చొచ్చుబడిపోయి ఎటూ కదలలేని దుస్థితి. మాటలు సరిగా రావు. ఎడమ కన్ను అస్సలు కనిపించదు. బాలుడికి శరీరంలో అన్నీ సమస్యలే. ఇంట్లో అటూ ఇటూ తిరగాలన్నా కష్టతరమే..ఎక్కడకి వెళ్లినా దేక్కూంటూ పోవాల్సిన పరిస్థితి. సామాజిక పింఛన్ పొందడానికి అన్ని అర్హతులు బాలుడిలో ఉన్నాయి. నాయకుల లోపమో లేక అధికారుల వైఫల్యమో తెలియదుకాని పింఛన్ పొందేందుకు ఇన్ని సజీవ సాక్ష్యాలున్నా బాలుడికి నేటికీ పింఛన్ మంజూరు కాలేదు. అసలే రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం.. బాధ్యత పడాల్సిన తండ్రి మూడేళ్ల క్రితమే ఇంటి నుంచి పరారయ్యాడు. తల్లి విజయనగరంలో ఓ హోటల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ వస్తున్న అరకొర జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. తాత దర్జీగా పని చేస్తూ కుటుంబ పోషణకు తన వంతుగా సహాయాన్ని అందిస్తున్నాడు. పింఛన్ మంజూరు కోసం నాయకులు, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకుండా పోయింది.
అన్ని అవయవాలు సమస్యే...
బాలుడు స్థానిక ప్రాధమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. రెండు సంవత్సరాల వయసులో బాగానే నడిచినా క్రమేపి రెండు కాళ్లు చచ్చుబడి పోయాయి. మూడేళ్ల వయసు నుంచే మాట రాకపోవడంతో అంగుటికి శస్త్ర చికిత్స చేయించారు. బాలుడు పుట్టిన 26రోజులకే కడుపులో సమస్య రావడంతో కడుపుకి ఆపరేషన్ చేయించారు. ఎడమ కన్ను పువ్వు వేయడంతో పూర్తిగా పని చేయడం మానేసింది. ప్రస్తుతం ఆ సమస్య కుడి కన్నుకు కూడా పాకడంతో ఇటీవలె శస్త్ర చికిత్స చేయించారు. కుడి చెయ్యి కూడా పనిచేయదు. బాలుడికి ప్రస్తుతం పది సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఇన్ని అర్హతలు ఉన్నా పింఛన్ మంజూరు కాకపోవడంతో ఎవరిని నిందించాలో తెలియని అయోమయ స్థితిలో ఆ నిరుపేద కుటుంబం ఉంది. చివరికి చేసేదేమీ లేక తల్లి శంకరి కలెక్టరేట్‌లో సోమవారం అర్జీ పెట్టుకున్నారు. కలెక్టర్ సార్ మా యందు దయ చూపండంటూ ఆయన వద్ద మొరపెట్టుకున్నారు.
కలెక్టర్ చేతుల మీదుగా బాలుడికి అవార్డు...
అవయవాలు పనిచేయక పోయినా బాలుడు సాయి దుర్గారావు అన్నింటా చురుకే. ఆరోగ్యం సహకరించకపోయినా ఎదో సాధించాలన్న తపనతో చదువుతుంటాడని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవాన్ని పురష్కరించుకొని బాలుడు పాడిన దేశభక్తి గీతం ఉత్తమ అవార్డుకు ఎంపికయ్యేలా చేసింది. పాడాలన్న తపనే అవార్డును అందుకునేలా చేసింది. జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ నేరుగా బాలుడికి అవార్డును అందించి ప్రోత్సహించారు. నిరుపేద కుటుంబం కావడంతో అదే చల్లని చేతులతో సమస్యను కూడా పరిష్కరించేలా చూస్తారని ఆశిద్దాం...
Comments
Please login to add a commentAdd a comment