మద్యం మాఫియా మహాదోపిడీ
జిల్లాలో అధికార పార్టీ లిక్కర్ సిండికేట్ వ్యవహారం మూడు ఫుల్‌బాటిళ్లు... ఆరు నిబ్బులుగా సాగిపోతోంది. అసలే పక్తూ మద్యం వ్యాపారులు...పైగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా.. దీంతో అడ్డూఅదుపు లేకుండా యథేచ్ఛగా మద్యం వ్యాపారంలో అక్రమాలకు పాల్పడుతున్నారు. మొత్తం మద్యం దుకాణాలను గుప్పిటపట్టిన ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరిదీ. సిండికేట్‌గా ఏర్పడి దుకాణాల కేటాయింపులో చక్రం తిప్పారు. లెక్కకు మించి బెల్టు దుకాణాలు తెరిచారు. ఇప్పుడు మద్యం ధరలను ఎమ్మార్పీ కంటే పెంచేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఏకంగా నెలకు రూ.15కోట్లుపైగా కొల్లగొడుతున్నారు.
- ధరల మాయాజాలం
- ఎంఆర్‌పీ కంటే అధికంగా రేట్లు
- అడ్డగోలుగా నెలకు రూ.15కోట్లు అవినీతి
- ఇద్దరు ప్రజాప్రతినిధుల ఇష్టారాజ్యం
అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు ఊళ్లు పంచుకున్న చందంగా జీవీఎంసీ, రూరల్ జిల్లాలను పంచేసుకున్నారు. నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి సిండికేట్‌లో జీవీఎంసీ పరిధిలో 169 దుకాణాల్లో వందకుపైగా దుకాణాలున్నాయి. తొలిసారి ఎన్నికైన మరో ప్రజాప్రతినిధి కుటుంబ సిండికేట్‌లో రూరల్ జిల్లాలో మద్యం దుకాణాలు ఉన్నాయి. 198 మద్యం దుకాణాల్లో 125 వరకు ఆ ప్రజాప్రతినిధి చెప్పిందే సాగుతోంది.
వేలం నోటిఫికేషన్ నుంచే కథ నడిపి అంతా తాము అనుకున్నట్లు చేసుకోగలిగారు. వ్యూహాత్మకంగా దుకాణాలను గుప్పిట్లో పెట్టుకున్న ఆ ఇద్దరు తాజాగా అసలు కథకు తెరతీశారు. మద్యం గరిష్ట ధర(ఎంఆర్‌పీ) కంటే 10శాతం నుంచి 15శాతం వరకు ఎక్కువగా ధరలు పెంచేశారు. దుకాణాలన్నీ వారి చేతుల్లోనే ఉండటంతో వారు చెప్పిందే ధరగా మారింది. బీరు బాటిల్ మీద రూ.20 అధికంగా అమ్ముతున్నారు. బ్రాండ్‌లను బట్టి విస్కీ, రమ్ము, ఇతర మద్యాన్ని క్వార్టర్ బాటిల్‌మీద రూ.10, ఆఫ్‌బాటిల్ మీద రూ.15, ఫుల్‌బాటిల్ మీద రూ.25వరకు అధికంగా విక్రయిస్తున్నారు. ఇందులో ఏముందిలో అనుకుంటున్నారేమో!... చిన్న విషయమేమీ కాదు. జిల్లాలో అధికారికంగా 367 దుకాణాలున్నాయి. జిల్లాలో నెలకు రూ.110కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.
అధికారిక లెక్కల ప్రకారం నెలకు జీవీఎంసీ పరిధిలో రూ. 69కోట్లు, రూరల్ జిల్లాలో రూ.41కోట్ల విలువైన మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఎంఆర్‌పీ కంటే ధరలు పెంచేయడంతో జీవీఎంసీ పరిధిలోనే నెలకు అక్రమంగా రూ.9కోట్లు వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. జిల్లా పరిధిలో నెలకు రూ.6కోట్ల వరకు అధికంగా గుంజుతున్నారు. ఆ లెక్కన నెలకు జిల్లాలో రూ.15కోట్లు అవినీతికి పాల్పడుతున్నారు. అంటే ఏడాదికి మద్యం విక్రయాల్లో రూ.180కోట్ల అవినీతి యథేచ్ఛగా సాగిపోతోంది. ఇదంతా అధికారిక మద్యం దుకాణాల్లో విక్రయాల్లో జరుగుతున్న అవినీతి. బెల్టు దుకాణాలకు వచ్చేసరికి మద్యం ధరలు మరింతగా పెరుగుతున్నాయి.
చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ
ఇష్టానుసారంగా ఎంఆర్‌పీ కంటే అధికంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న ఎక్సైజ్ శాఖ అధికారులు కిమ్మనడం లేదు. కనీసం అటువైపు చూడటమే లేదు. ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సిండికేట్‌ను నిర్వహిస్తుండటమే ఇందుకు కారణమన్నది బహిరంగ రహస్యమే. వారు చేసింది చూడటం... ఇచ్చింది తీసుకోవడం అన్న తీరుగా వ్యవహరిస్తోంది.