మద్యం మాయ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : జిల్లాలో సొంత ఎక్సైజ్ విధానానికి టీడీపీ పెద్దలు తెరతీశారు. రాష్ట్రమంతటా ఏ విధానం అనుసరిస్తారో మాకు అనవసరం... మా ప్రాంతంలో మేం చెప్పిందే విధానమన్నట్లుగా ఉంది వారి తీరు. ప్రధానంగా అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల్లో ఇద్దరు కీలక ప్రజాప్రతినిధులు ఈ మద్యం మాయాజాలన్ని ప్రదర్శిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు సొంత ఫర్మానాలు జారీ చేస్తున్నారు.
నిన్నటికి నిన్న బెల్టు దుకాణాలు మూయించడానికి వీల్లేదని హుకుం జారీ చేసిన టీడీపీ నేతలు... తాజాగా ప్రభుత్వ మద్యం దుకాణాల మీద పడ్డారు. తమ ప్రాంతంలో తమ అనుయాయులు మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న కేంద్రాలకు సమీపంలో ప్రభుత్వం మద్యం దుకాణాలు ఉండటానికి వీల్లేదని ఆదేశించారు. అనకాపల్లి సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలో ఏకంగా 30 ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు. తద్వారా తమ సిండికేట్‌లోని మద్యం దుకాణాలకు భారీ ఆదాయం వచ్చేలా చేస్తున్నారు.
కశింకోట... ఓ మచ్చుతునక
అనకాపల్లికి చెందిన ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కశింకోట సమీపంలో ప్రభుత్వం మద్య దుకాణాన్ని ఏర్పాటు చేయాలన్న ఎక్సైజ్ అధికారుల నిర్ణయాన్ని అడ్డుకున్నారు. ఎందుకంటే అధికార పార్టీ పెద్దల గుప్పిట్లోని సిండికేట్‌కే కశింకోటలో మద్యం దుకాణం టెండరు పాడారు. జాతీయరహదారికి ఆనుకుని ఉన్న అక్కడ మద్యం వ్యాపారం ద్వారా భారీ ఆదాయం గడించేందుకు చేయాల్సిందంగా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయంమేరకు కశింకోట సమీపంలో ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారుల నిర్ణయాన్నే అడ్డుకున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణం వస్తే తమ సిండికేట్ దుకాణం ఆదాయానికి గండిపడుతుందని టీడీపీ పెద్దలు భావించారు.
దాంతో ఇద్దరు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. కశింకోటలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి వీల్లేదని ఎక్సైజ్ ఉన్నతాధికారికి తేల్చిచెప్పారు. మహిళలు వ్యతిరేకిస్తున్నందున ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయవద్దని కారణం చూపించారు. మరి ప్రైవేటు మద్యం దుకాణం కొనసాగుతుండటంపై మహిళలు అభ్యంతరం వ్యక్తం చేయలేదా?... ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదా అంటే సమాధానమే లేదు. అసలు అక్కడ తమ మద్యం వ్యాపారానికి గండి పడకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారన్నది బహిరంగ రహస్యమే. ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు కశింకోట సమీపంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. నాలుగేళ్లుగా టీడీపీ పెద్దలు కశింకోట కేంద్రంగా మద్యం సిండికేట్‌ను శాసిస్తున్నారు.
అక్కడ నాలుగేళ్ల క్రితం నాలుగు మద్యం దుకాణాలు ఉండేవి. తద్వారా ప్రభుత్వానికి ఏడాదికి రూ.2కోట్లు ఆదాయం వచ్చేది. ఆ తరువాత మూడు దుకాణాలకు తగ్గించేశారు. అప్పట్లో ప్రభుత్వానికి ఏడాదికి రూ.1.05కోట్లు ఆదాయం లభించేది. తరువాత రెండు దుకాణాలను తగ్గించేశారు. ఈసారి కేవలం ఒక్క దుకాణమే ఉండేట్లుగా కథ నడిపించారు. దాంతో ప్రస్తుతం ప్రభుత్వానికి రూ.65లక్షలు మాత్రమే ఆదాయం రానుంది. తాజాగా ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటును కూడా అడ్డుకున్నారు.
అంతటా అదే తీరు
ఈ మద్యం మయాజాలం కశింకోటకే పరిమితం కాలేదు. అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అనకాపల్లి, గాజువాక ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అదే రాజనీతి నడుస్తోంది. అనకాపల్లి సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలో 49 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాటిలో 34 దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. కానీ వాటిలో కేవలం 22 దుకాణాలకే ఆమోదం తెలిపారు. మిగిలిన 12 దుకాణాలు ఏర్పాటు చేయకుండా టీడీపీ పెద్దలు అడ్డుకున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ప్రభుత్వ దుకాణాలు ఏర్పాటు చేస్తే తమ సిండికేట్ ఆదాయానికి గండిపడుతుందనే టీడీపీ పెద్దలు అడ్డుచెప్పారు.
ఇక గాజువాక సర్కిల్ పరిధిలో పరిస్థితీ అంతే. అక్కడ 45 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కానీ 22 దుకాణాల ఏర్పాటుకే ఆమోదం తెలిపారు. గుడి, బడికి సమీపంలో ఉన్నాయని 5 దుకాణాల ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. కాగా టీడీపీ పెద్దలు అడ్డుకోవడం వల్లే మిగిలిన కేంద్రాల వద్ద ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు నిర్ణయాన్ని అధికారులు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా జిల్లాలో ఎక్సైజ్ అధికారులను హడలెత్తిస్తూ... మద్యం సిండికేట్‌ను తమ గుప్పిట్లో పెట్టుకుని టీడీపీ పెద్దలు సొంత మద్యం సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు.