
వైఎస్ మేనత్త రాజమ్మ ఆకస్మిక మృతి
పలువురు వైఎస్ కుటుంబీకుల నివాళి
పులివెందుల: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మేనత్త ఎస్.రాజమ్మ(87) ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆకస్మికంగా మృతి చెందారు. పులివెందులలోని మారుతిహాలు రోడ్డులో ఉన్న బేతేలు చర్చిలో ప్రభురాత్రి ఆచరణ కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు చేస్తూ అక్కడే తనువు చాలించారు. రాజమ్మ భర్త జేసుదాసు డేవిడ్ కూడా గతంలో విజయవాడలో ప్రార్థనలు చేస్తూనే మృతి చెందారు. రాజమ్మకు ముగ్గురు కుమారులు రాబర్ట్, ఆశీర్వాదం, మోదష్, రాజమ్మ వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు క్యాంబెల్ ఆసుపత్రిలో నర్సింగ్ సూపరింటెండెంటుగా పనిచేస్తూ రిటైరయ్యారు. ఆ తర్వాత కూడా తన సోదరుడి పేరుతో నిర్మించిన వైఎస్ రాజారెడ్డి వైద్యశాలలో రోగులకు సేవ చేసేవారు.
రాజమ్మ మృతి విషయం తెలుసుకున్న వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్ రాజారెడ్డి ఆసుపత్రి ఆవరణలో ఉన్న ఇంటి వద్దకు వచ్చి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో రాజమ్మ సోదరి కమలమ్మ, సోదరుడు పురుషోత్తమరెడ్డిలతోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, శివప్రకాష్‌రెడ్డి, సుగుణమ్మ, ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు ఉన్నారు.