సదావర్తి భూములు మళ్లీ సర్కారు పెద్దల చేతికే!
మంత్రి లోకేశ్ స్కెచ్.. మరో మంత్రి ఆది డైరెక్షన్
చెన్నైలో వేలానికి ప్రొద్దుటూరులో మంత్రాంగం
- వేలంలో భూములు దక్కించుకున్న టీడీపీ నేత వరద వర్గీయుడు
- నాడు పనికిరాని భూములంటూనే నేడు పోటీపడి దక్కించుకున్నారని విమర్శల వెల్లువ
సాక్షి ప్రతినిధి, కడప/ప్రొద్దుటూరు: గుంటూరు జిల్లా అమరావతిలోని సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని వందల కోట్ల రూపాయల విలువైన భూములను ఎట్టకేలకు పక్కా వ్యూహంతో రెండవసారి వేలంలో కూడా టీడీపీ పెద్దలే దక్కించుకున్నారు. గతంలో తొలిసారి వేలం నిర్వహించి.. ఈ భూములను రూ.22.44 కోట్లకు కారు చౌకగా తమ వారికి ప్రభుత్వ పెద్దలు కట్టబెట్టిన విషయం తెలిసిందే. వందల కోట్ల విలువ చేసే భూములను కాపు కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నేత రామానుజయకు కట్టబెట్టడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర దాగి ఉందని వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు ఎక్కారు.
ఆ భూములు విలువైనవి కావని, వాటిని కొనేవారెవరూ లేరని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. పైగా.. వేలం పాటలో వచ్చిన రూ.22.44 కోట్ల కంటే రూ.5 కోట్లు ఎక్కువగా ఇచ్చిన వారికి ఆ భూములు ఇచ్చేస్తామని కూడా చెప్పారు. హైకోర్టు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. అదనంగా రూ.5 కోట్లు చెల్లించగలరా అంటూ అప్పట్లో ఎమ్మెల్యే ఆర్కేను అడిగింది. ఇందుకు ఆయన సమ్మతించడం.. ఆ మేరకు డబ్బు డిపాజిట్ చేయడం విదితమే. ఆ తర్వాత ఈ భూములకు మళ్లీ వేలం నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం, సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించడం తెలిసిందే.
కోర్టు ఆదేశం మేరకు సోమవారం చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో నిర్వహించిన వేలం పాటలో ఈసారి వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుడిభుజంగా ఉన్న శ్రీనివాసులురెడ్డి రూ.60.30 కోట్లకు 83.11 ఎకరాలను అనూహ్యంగా దక్కించుకున్నారు. వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డితో సహా ఆయన ఈ వేలంపాటకు హాజరై సత్యనారాయణ బిల్డర్స్ సంస్థ పేరు మీద భూములు దక్కించుకోవడం జిల్లా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తి ఈ భూములు దక్కించుకున్నారనే విషయం ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న జిల్లా వాసులు ఎవరీ శ్రీనివాసులురెడ్డి అని ఆరా తీశారు.
ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన సత్యనారాయణ బిల్డర్స్‌లో 8 మంది డైరెక్టర్లు ఉన్నారు. వీరిలో వరదరాజులరెడ్డి కుడిభుజంగా ఉన్న బద్వేలు శ్రీనివాసులురెడ్డి ఒకరు. మాజీ కౌన్సిలర్ అయిన ఇతణ్ని వరదరాజులురెడ్డి సిఫారసుతో గత ఏడాది జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌గా నియమించారు. ప్రస్తుతం ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో నిర్మిస్తున్న మల్టీప్లెక్స్‌లో ఇతనితోపాటు వరదరాజులురెడ్డి కుమారుడు కొండారెడ్డి భాగస్వామిగా ఉన్నట్లు సమాచారం. రూ.60 – 70 కోట్ల వ్యయంతో ఐదు స్క్రీన్లతో సినిమా థియేటర్ వ్యాపార సముదాయంతో ఈ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం కోసం మున్సిపాలిటీ కొన్ని నిబంధనలను సవరించిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్మాణాన్ని వరదరాజులరెడ్డి చేతుల మీదుగానే ప్రారంభించారు.
చక్రం తిప్పిన మంత్రి లోకేశ్
భూములు ఎలాగైనా దక్కించుకోవాలని ఉన్న మంత్రి నారా లోకేశ్ డైరెక్షన్.. మంత్రి ఆదినారాయణరెడ్డి సహకారంతోనే టీడీపీ నేత వరదరాజులురెడ్డి కుడిభుజం శ్రీనివాసులురెడ్డి ఈ భూముల వేలం పాటలో అత్యధిక బిడ్డర్‌గా నిలిచారనే ఆరోపణలున్నాయి. గతంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయను బినామీగా పెట్టుకుని కథ నడిపించిన లోకేశ్.. ఈసారి మంత్రి ఆది ద్వారా వేలం పాటలో పాల్గొనే బృందాన్ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం ప్రొద్దుటూరుకు వచ్చిన మంత్రి ఆదినారాయణరెడ్డి వరదరాజులురెడ్డి కళాశాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంలోనే సదావర్తి భూముల వేలం పాల్గొనే వ్యూహం రచించారని సమాచారం. వేలంపాటకు వరద కుమారుడు కొండారెడ్డి, ఆయన వర్గీయుడు, రాజుపాళెం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తోట మహేశ్వరరెడ్డి హాజరవ్వడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
తొలిసారి వేలం నిర్వహించాక తక్కువ ధరకే కట్టబెట్టారని విమర్శలు రావడంతో అవి విలువైన భూములు కాదని సీఎం, మంత్రులు ఊదరగొట్టారు. అవి నిజంగానే విలువైన భూములు కాకపోతే ఇపుడు అంతకు సుమారు మూడు రెట్లు ఎక్కువ ధర ఎందుకు చెల్లిస్తున్నారని, ఈ విషయంలోనే సర్కారు పెద్దల కుట్ర స్పష్టమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్‌సీపీ పోరాటం వల్లే పెద్దల నిర్వాకం బట్టబయలైందని పలువురు ప్రజా సంఘాల నేతలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు.
పోటీ ఉండకూడదని పక్కా వ్యూహం
రెండోసారి వేలానికి ప్రముఖ సంస్థలు బరిలోకి రాకుండా ‘పెద్దలు’ పన్నిన వ్యూహం ఫలించింది. సదావర్తి భూములకు తిరిగి వేలం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించగానే తమదైన శైలిలో టీడీపీ పెద్దలు చక్రం తిప్పారు. వాస్తవానికి చెన్నైలోని 83.11 ఎకరాల భూములను వేలం వేస్తున్నట్లు చాలా మంది ప్రముఖ బిల్డర్లకు తెలియదు. గడువు ఇచ్చి.. ప్రచారం నిర్వహించలేదు. లేదంటే జాతీయ స్థాయిలో పెద్ద సంస్థలు ముందుకు వచ్చి ఉండేవి. పైగా ఈ భూముల విషయమై చాలా వివాదాలు ఉన్నట్లు తెరపైకి తెచ్చారు. తద్వారా పెద్ద రియల్టర్లు, బిల్డర్లు పాల్గొనకుండా చేశారు. భూములు దక్కించుకున్న వారికి రిజిస్ట్రేషన్ చేసివ్వబో మంటూ భయపెట్టారు. అంత పెద్ద ఎత్తున వందల కోట్లు పెట్టి భూములు కొనుగోలు చేస్తే.. రిజిస్ట్రేషన్ చేసివ్వబోమంటే ఏ సంస్థ ముందుకొస్తుంది? సర్కారు పెద్దలకు కావాల్సింది అదేమరి. ఇదే అదనుగా రెండోసారి ఈ భూములను దక్కించుకుంది.
‘వరద’ కారులో వేలానికి..
చెన్నై : సదావర్తి సత్రం భూముల రెండో విడత వేలంలో అత్యధిక బిడ్డరుగా నిలిచిన సత్యనారాయణ బిల్డర్స్ భాగస్వామి శ్రీనివాçసులు రెడ్డి వెనుక ఉన్నది టీడీపీ పెద్దలే అన్నది స్పష్టమైంది. చెన్నైలో జరిగిన వేలంలో పాల్గొనేందుకు శ్రీనివాసులు రెడ్డి పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి సొంత కారులో వచ్చారు. ఏపీ 04 బిడి 3355 కారులో అనుచరులతో కలసి వేలం జరిగిన చెన్నై టీ నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రానికి చేరుకున్నారు. ఆ కారు స్వయంగా నంద్యాల వరదరాజులు రెడ్డి పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ఈ విషయం సోమవారం మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.