సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తాం | YSRCP MLA Alla Rama Krishna Reddy Speech In AP Assembly Over Sadavarti Lands | Sakshi
Sakshi News home page

సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తాం

Published Tue, Jul 16 2019 11:57 AM | Last Updated on Tue, Jul 16 2019 1:05 PM

YSRCP MLA Alla Rama Krishna Reddy Speech In AP Assembly Over Sadavarti Lands - Sakshi

సాక్షి, అమరావతి : సదావర్తి భూముల్లో అక్రమాలపై విచారణ జరిపిస్తామని దేవాదాయ, ధ‌ర్మాదాయ శాఖ‌ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో దేవదాయ శాఖ భూములపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి వెల్లంపల్లి సమాధానమిచ్చారు. సింహాచలం దేవస్థానం పంచగ్రామాల ప్రజలను మభ్యపెట్టేందుకు గత ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి కేబినెట్‌లోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఈ భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి అడ్వొకేట్‌ జనరల్‌తో సమీక్ష చేపట్టారని వెల్లడించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.  

ఈ సందర్భంగా సదావర్తి భూముల్లో అక్రమాలకు సబంధించి పలు అంశాలను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ‘2018 ఆగస్టులో సదావర్తి భూములను అమ్మేయాలని మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్‌ అప్పటి ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో గత ప్రభుత్వం తమిళనాడులోని చిన్న పేపర్‌లో ప్రకటన ఇస్తే.. గుంటూరులోని చంద్రబాబు బినామీలు వెళ్లి ఆ వేలంలో పాల్గొన్నారు. వేలంలో ఎకరం భూమి ధరను రూ. 50 లక్షలు నిర్ణయిస్తే.. చంద్రబాబు బినామీలు రూ. 22లక్షలకే వేలం పాడారు. ఆ తర్వాత సదావర్తి భూముల వేలం అధికారి తమను బతిమిలాడితే.. మరో రూ. 5లక్షలు అధిక ధరకు పాడినట్టు మినిట్స్‌లో రాసుకున్నారు. దేవదాయ శాఖ అధికారి భ్రమరాంబ ఎకరం భూమి ధర రూ. 6 కోట్లు ఉంటుందని ఆర్టీఐ యాక్ట్‌ ద్వారా తెలిపారు. దీంతో సదావర్తి భూముల అక్రమాలపై న్యాయం కోసం నేను కోర్టును ఆశ్రయించాను. అయితే కోర్టుకెళ్లిన నాపై ఐటీ దాడులు చేయిస్తామంటూ అప్పటి మంత్రి నారా లోకేశ్‌ బెదిరింపులకు పాల్పడ్డారు. అందుకే సదావర్తి భూములపై విజిలెన్స్‌ దర్యాప్తు చేయించాల’ని ఆర్కే కోరారు. 

దీనిపై మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. సదావర్తి భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. సీనియర్‌ అధికారి ద్వారా దీనిపై విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ.. సదావర్తి భూములకు టైటిల్‌ డీడ్‌ లేదని చెప్పుకొచ్చారు. అయితే దీనిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారథి తప్పుపట్టారు. సదావర్తి భూములకు టైటిల్‌ డీడ్‌ లేదని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. టైటిట్ డీడ్‌ లేని భూమిని రాష్ట్ర ప్రభుత్వం మరొకరికి అంటగట్టొచ్చా అని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement