టీడీపీలో చేరేందుకు శైలజానాథ్ యత్నం
అనంతపురం: సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఝలక్ ఇవ్వనున్నారా? ఆదిలో టీడీపీలో చేరేందుకు తన సన్నిహితుడు ద్వారా జేసీ బ్రదర్స్‌తో నెరపిన రాయబారం విఫలమైందా? ఇప్పుడు చంద్రబాబు కోటరీలో కీలకమైన సీఎం రమేష్ ద్వారా శైలజానాథ్ బేరసారాలు సాగిస్తున్నారా? అనే ప్రశ్నలకు టీడీపీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. శింగనమలలో ఆదివారం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ శమంతకమణి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ శ్రేణులు ఇదే విషయంపై మండిపడ్డాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో 2004 ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుంచి విజయం సాధించి.. శాసనసభలో అడుగుపెట్టిన శైలజానాథ్.. 2009 ఎన్నికల్లోనూ గెలుపొందారు. వైఎస్ హఠాన్మరణం శైలజానాథ్‌కు అనూహ్యంగా స్థానం దక్కింది. జేసీ దివాకర్‌రెడ్డికి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అంతరంగికుడిగా శైలజానాథ్ వ్యవహరిస్తున్నారు. సీఎంగా కిరణ్ ఉన్న కాలంలో ఆయన దన్నుతో శైలజానాథ్ భారీ ఎత్తున అక్రమార్జన సాగించారనే ఆరోపణలు అప్పట్లో కాంగ్రెస్ నేతల నుంచే వ్యక్తమయ్యాయి. కిరణ్‌తో కలిసి సమైక్యరాగం ఆలపిస్తూ ఆయన వెన్నంటే నడిచారు. ఇందుకు ప్రతిఫలంగానే కిరణ్.. శైలజానాథ్‌ను సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు.
కాగా, కిరణ్.. సీఎం పదవికి రాజీనామా చేయక ముందే శైలజానాథ్ పక్క చూపులు చూశారు. వైఎస్సార్‌సీపీలో ఖాళీ లేకపోవడంతో టీడీపీపై కన్నేశారు. వచ్చే ఎన్నికల్లో శింగనమల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎత్తు వేశారు. ఆ క్రమంలోనే తన సన్నిహితుడు బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డిని జేసీ బ్రదర్స్ వద్దకు రాయబారం పంపారు. టీడీపీలో తనకు శింగనమల నుంచి అవకాశం కల్పించేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలన్న శైలజానాథ్ ప్రతిపాదనకు జేసీ బ్రదర్స్ అంగీకరించలేదు. ఆ సీటును తమ అనుచరుడు కంబగిరి రాముడుకు ఇప్పించుకుంటామని జేసీ బ్రదర్స్ తెగేసి చెప్పడంతోనే విధిలేని పరిస్థితుల్లో శైలజానాథ్.. కిరణ్ వెంట నడిచారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కిరణ్ ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర పార్టీకి భవిత లేదనే భావనకు వచ్చిన శైలజానాథ్.. మళ్లీ టీడీపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే చంద్రబాబు కోటరీలో కీలకమైన సీఎం రమేష్‌తో ఆయన చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో తనకు శింగనమల నుంచి అవకాశం కల్పిస్తే.. పార్టీ ఫండ్ రూపంలో భారీ ఎత్తున ముట్టజెపుతానని శైలజానాథ్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు టీడీపీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు.
ఆ బంపర్ ఆఫర్‌ను చంద్రబాబు దృష్టికి సీఎం రమేష్ తీసుకె ళ్లగా.. చంద్రబాబు ఆదేశాల మేరకు శింగనమల నియోజకవర్గ టీడీపీ శ్రేణుల అభిప్రాయాన్ని సేకరించాలని ఎమ్మెల్సీ శమంతకమణిని ఆయన కోరినట్లు తెలిసింది. శింగనమల నుంచి తన కుమారుడిని గానీ.. కుమార్తెను గానీ టీడీపీ తరఫున బరిలోకి దింపాలని శమంతకమణి భావించారు. కానీ.. ఇటీవల ఆ ఆలోచనను ఆమె విరమించుకున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె ఎందుకు వెనక్కి తగ్గారన్నది శైలజానాథ్‌కే ఎరుకని టీడీపీ నేతలు చలోక్తులు విసురుతున్నారు.
శైలజానాథ్‌ను పార్టీలోకి చేర్చుకోవడంపై శ్రేణుల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి సీఎం రమేష్ సమావేశం ఏర్పాటు చేయమనగానే శమంతకమణి కార్యకర్తల సమావేశం నిర్వహించడంతో ఆ అనుమానాలు బలపడుతున్నాయి. కానీ.. సమావేశంలో కార్యకర్తలు శైలజానాథ్ చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. అదే జరిగితే పార్టీని వీడుతామని స్పష్టం చేసినట్లు సమాచారం. పార్టీ శ్రేణుల మనోభిప్రాయాలతో నిమిత్తం లేకుండానే ‘భారీ ప్యాకేజ్’ ద్వారా శైలజానాథ్‌కు టీడీపీ తీర్థం ఇచ్చేందుకు బాబు సిద్ధపడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.