ఒంగోలు సబర్బన్ : రాష్ట్రంలో టీడీపీ పాలన అస్తవ్యస్థంగా మారిందని, సాధారణంగా ప్రభుత్వంపై రెండుమూడేళ్ల తర్వాత ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందని, అలాంటిది ఏడు నెలల్లోపే ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. సోమవారం ఒంగోలు వచ్చిన ఆయన స్థానిక డీసీసీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై విమర్శలు గుప్పించారు.
మొన్నటి సాధారణ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేశాడని ధ్వజమెత్తారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూయించటం మినహా ఇప్పటి వరకు ఆయన ఒరగబెట్టిందేమీలేదన్నారు. జిల్లా అభివృద్ధి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. ఇసుక రీచ్‌లను డ్వాక్రా గ్రూపులకు అప్పగించామని చెప్పారని, చివరకు అవి టీడీపీ నాయకులు, కార్యకర్తల చేతుల్లోకి వెళ్లాయన్నారు. గతంలో ఉన్న ఇసుక ధరలు ప్రస్తుతం రెట్టింపు కావడంతో సామాన్య ప్రజలకు ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా ప్రజలను మోసం చేసే పనిలోనే నిమగ్నమై ఉందన్నారు. ప్రజలకు హక్కులు కల్పించటం, సుపరిపాలన అందించటం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమన్నారు. బీజేపీ స్వచ్ఛ భారత్ పేరిట ప్రజాధనం రూ.కోట్లు వృథా చేస్తోందని శైలజానాథ్ విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో దొనకొండను పారిశ్రామిక కారిడార్ చేస్తానని చంద్రబాబు గెలిచినప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారని, ఇంత వరకు విధి విధానాలు కూడా విడుదల చేసిన దాఖలాలు లేవన్నారు.
అసలు పారిశ్రామిక కారిడార్ ఎక్కడ పెడతారో తెలియని అయోమయంలో జిల్లా ప్రజలున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో ప్రజల్లో మార్పు రానుందన్నారు.సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ జి.రాజ్‌విమల్, ఎద్దు శశికాంత్‌భూషణ్, వేమా శ్రీనివాసరావు, దాసరి నాగలక్ష్మి, గాదె లక్ష్మారెడ్డి, పర్రె నవీన్‌రాయ్ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ పాలన అస్తవ్యస్తం
Published Tue, Dec 30 2014 1:35 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement